TRUMP-MUSK: బద్ధ శత్రువులుగా మారిన ప్రాణ మిత్రులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. దోస్తీకి స్వస్తి పలికి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ట్రంప్, మస్క్‌ల మధ్య గొడవలు నాటకీయ పరిణామాల నడుమ రోజురోజుకీ ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలతో పోటాపోటీ పడుతున్నారు. తాజాగా.. ట్రంప్‌ను అభిశంసించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్ బహిరంగంగా చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనంగా మారాయి. ముఖ్యంగా డోజ్ అధినేతగా మస్క్ ఉన్నన్ని రోజులు వీరిద్దరూ ప్రాణ స్నేహితుల్లా వ్యవహరించారు. ఆ పదవి పోయినప్పటి నుంచి మళ్లీ మస్క్, ట్రంప్ మధ్య బంధం చెడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మస్క్ రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును వ్యతిరేకించగా.. ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్క్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. దీనిపై స్పందించిన మస్క్ తన వల్లే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారని అన్నారు. తాను లేకపోతే ట్రంప్ కచ్చితంగా ఓడిపోయేవారని పేర్కొన్నారు.
రిపబ్లికన్ ట్యాక్స్ విషయంలో వివాదం
మస్క్ రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును వ్యతిరేకించడంతో ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా దానిపై మస్క్ స్పందించారు. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని అంటూనే.. తన వల్లే ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారని పేర్కొన్నారు. తాను లేకపోయి ఉంటే ట్రంప్ కచ్చితంగా ఓడిపోయే వారని వివరించారు. ట్రంప్ ఓ సభలో మాట్లాడుతూ.. మస్క్ రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసుండేది కాదన్నారు. మస్క్ కామెంట్లకు తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. దీనికి మస్క్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టి మరీ తన వ్యతిరేకను వెల్లడించారు. ట్రంప్ నాకు సాయం చేసినట్లు చెప్పడం పూర్తి అబద్ధం అని వ్యాఖ్యానించారు. తనకు, తన కంపెనీలకు ఆయన పాలన కాలంలో ఎదురైన కఠినమైన పరిస్థితులను ఎవరూ మర్చిపోలేరని గుర్తు చేశారు. “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు”పై ఎలోన్ మస్క్ తీవ్ర విమర్శలు చేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. EVలకు ఫెడరల్ కన్స్యూమర్ టాక్స్ క్రెడిట్‌ను దశలవారీగా తొలగించాలనే ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ప్రణాళిక నుంచి మస్క్ వ్యతిరేకత వచ్చిందని, ఇది టెస్లాను నేరుగా ప్రభావితం చేస్తుందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ బిల్లు విషయంలో తాను తీవ్రంగా 'నిరాశచెందా' అని వ్యాఖ్యానించిన మరుసటి రోజే మస్క్, ట్రంప్ పరిపాలన నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తరువాత ట్రంప్ బడ్జెట్ బిల్లును తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా చురుకైన ప్రచారం కూడా చేస్తున్నారు.
కొత్త పార్టీ పెడతానని మస్క్ హెచ్చరిక
డొనాల్డ్ ట్రంప్ తన వల్లే గెలిచారని ఎలాన్ మస్క్ గట్టిగా నమ్ముతున్నారు. అదే చెబుతున్నారు. ట్రంప్ విధానాలు నచ్చడం లేదని ఇప్పుడు మస్క్ అంటున్నారు. బిగ్ అండ్ బ్యూటీఫుల్ పేరుతో తెస్తున్న బిల్లు ఖర్చులను పెంచేదిగా ఉందని అది అమెరికాను దివాలా తీయిస్తుందని మస్క్ నమ్మకం. కానీ ట్రంప్... మస్క్ నమ్మకాలను నమ్మే వ్యక్తి కాదు. అందుకే దూరం పెట్టాడన్న వాదన ఉంది . ఇప్పటికే మస్క్ ను డోజ్ నుంచి గెంటేశాడు. ఇప్పుడు .. నా వల్లే గెలిచావని మస్క్ అంటే.. నువ్వు లేకపోయినా గెలిచేవాడినని ట్రంప్ అంటున్నారు. తనతో ఎవరైనా విభేదిస్తే వారిపై ప్రతీకారానికి దిగడం ట్రంప్ లక్షణం. ఇప్పుడు మస్క్ పైనా అదే చేస్తున్నారు. మస్క్ వ్యాపార వ్యవహారాలకు సహకరించే సంస్థలపై పన్నులు వేస్తానని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో విధించవచ్చు కూడా. అందుకే మస్క్ కొత్త పార్టీ పెడతానని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఎనభై శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా పార్టీ ఉంటుందంటున్నారు.
అంత తొందర ఎందుకు..?
‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ గురించి ట్రంప్ చేసిన వాదనలను మస్క్, X లో పోస్ట్ చేస్తూ కొట్టిపారేశాడు. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా.. ‘ఈ బిల్లు నాకు ఒక్కసారి కూడా చూపించలేదు. రాత్రికి రాత్రే ఆమోదించారు. దాదాపు ఎవరూ దానిని చదవలేకపోయారు.’ ‘ఏమైనా సరే. చమురు, గ్యాస్ సబ్సిడీలను తాకకపోయినా.. బిల్లులో EV/సోలార్ ప్రోత్సాహకాలను కొనసాగించండి అని రాసుకొచ్చారు.
మస్క్ కోసం ట్రంప్ నిర్ణయం మారదు- వైట్ హౌస్
అంతే కాదు అమెరికాను ఇలా దివాలా తీయిస్తుంటే.. దేశపౌరులుగా మీకు బాధ్యతుండక్కర్లా.. అంటూ హితవు పలికారు మస్క్. అయితే మస్క్ విమర్శలను వైట్ హౌస్ పిచ్చ లైట్ తీస్కుంది. ఈ బిల్లు గురించి మస్క్ అభిప్రాయమేంటో.. ట్రంప్ కి బాగా తెలుసు. ఆయన ఒపీనియన్ ద్వారా ట్రంప్ నిర్ణయం మారదు. ఇదొక గొప్ప బిల్లు. దీన్ని ట్రంప్ తప్పక కంటిన్యూ చేస్తారంటూ.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ అన్నారు. ఇక డోజ్ కి మస్క్ ఎప్పుడైతే.. సలహాదారుగా నియమితులయ్యారో.. అప్పటి నుంచీ మస్క్ కి తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. మెడికేడ్ వంటి కార్యక్రమాల బడ్జెట్ కోతలు.. ఇలా పలు రకాలుగా ప్రజా వ్యతిరేఖ చర్యలకు పాల్పడాల్సి వచ్చేది. దీంతో ప్రజల్లో మస్క్ కి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశమేర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com