Donald Trump: రష్యా, చైనా, ఇరాన్‌లతో ఆర్థిక సంబంధాలను తెంచుకోండి: వెనిజువెలాకు ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజువెలా దేశంపై తన ఆధిపత్యాన్ని చూపించాలని పట్టుదలతో ఉన్నారు. వెనిజువెలాలో ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించి తీసుకువెళ్లాయి. ఆ తర్వాత డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ట్రంప్ మాత్రం వెనిజువెలాను తానే నియంత్రిస్తున్నానని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆ దేశానికి చెందిన చమురు ఉత్పత్తిని పెంచుకోవాలంటే కొన్ని షరతులు పాటించాలని అమెరికా డిమాండ్ చేస్తోందని ఏబీసీ న్యూస్ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం వెనిజువెలా కొత్త నాయకత్వం చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలి. అంతేకాదు, చమురు ఉత్పత్తిలో అమెరికాతో మాత్రమే భాగస్వామ్యం చేయాలి, ముఖ్యంగా హెవీ క్రూడ్ ఆయిల్ విక్రయాల్లో అమెరికాకు ప్రాధాన్యం ఇవ్వాలి.
మరోవైపు, వెనిజువెలా దేశం చైనాతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. చైనా ఆ దేశం నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు అమెరికా తన షరతులను ఎలా రుద్దుతుందనేది కీలకం. యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రైవేట్ మీటింగ్‌లో ఎంపీలతో మాట్లాడుతూ, వెనిజువెలా చమురు ట్యాంకర్లు పూర్తిగా నిండిపోయాయని, అందుకే వారు తమ డిమాండ్లకు లొంగక తప్పదని చెప్పారు. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం, డిసెంబర్ చివరి నుంచి వెనిజువెలా చమురు బావులను మూసేస్తోంది ఎందుకంటే అమెరికా ఆంక్షల వల్ల స్టోరేజ్ స్పేస్ లేకుండా పోయింది. మరిన్ని బావులు మూసేస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుంది, తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగెజ్ అధికారం కూడా ప్రమాదంలో పడుతుంది.
అమెరికా అంచనాల ప్రకారం, వెనిజువెలా రాజధాని కరాకస్‌కు కేవలం కొన్ని వారాల్లోనే ఆర్థికంగా నిర్వీర్యమైపోయే పరిస్థితి వస్తుంది. చమురు విక్రయాలు లేకుండా దేశం తట్టుకోలేదని చెబుతున్నారు. సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వికర్ ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ, అమెరికా ప్రభుత్వం వెనిజువెలా చమురును తమ నియంత్రణలోకి తీసుకోవాలని భావిస్తోందని, ఆ ట్యాంకర్లు హవానా వంటి చోట్లకు వెళ్లకుండా చూసుకుంటామని అన్నారు. ఓపెన్ మార్కెట్‌లోకి వెళ్లకుండా ఉంటే మరిన్ని ట్యాంకర్లు నింపే అవకాశం లేదని... ఎందుకంటే అన్నీ పూర్తిగా నిండిపోయాయని ఆయన వివరించారు
అంతేకాకుండా, ట్రంప్ మరో ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. వెనిజువెలా తాత్కాలిక అధికారులు 30 మిలియన్ నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ చమురును అమెరికాకు అప్పగించనున్నారని, దాన్ని మార్కెట్ ధరకు విక్రయించి వచ్చిన డబ్బును తాను నియంత్రిస్తానని చెప్పారు. ఆ నిధులు వెనిజువెలా ప్రజలు మరియు అమెరికా ప్రజల ప్రయోజనాలకు వినియోగిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలు వెనిజువెలా భవిష్యత్తును మరింత అనిశ్చితంగా మార్చాయి. అమెరికా ఆధిపత్యం వల్ల ఆ దేశం ఆర్థికంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుందో చూడాలి. ఇటువంటి ఒత్తిళ్లు ఇతర దేశాలతో సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది కూడా చర్చనీయాంశం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

