Trump ఐక్యరాజ్యసమితిలో కుట్ర జరిగింది.. కారకుల అరెస్ట్‌కు ట్రంప్ ఆదేశాలు

ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో తన పర్యటన సందర్భంగా మూడు అనుమానాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయని, ఇదంతా తనపై ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలను ఆయన "ట్రిపుల్ సాబోటేజ్"గా అభివర్ణించారు. దీనిపై సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు జరుపుతుందని బుధవారం తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ట్రంప్, ప్రసంగం అనంతరం వరుసగా మూడు సమస్యలను ఎదుర్కొన్నారు. తన బృందంతో కలిసి ఎస్కలేటర్‌పై వెళ్తుండగా అది పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఆగిపోయిందని, ఇది కచ్చితంగా సాబోటేజ్ అని ట్రంప్ ఆరోపించారు. ఇక, తాను ప్రసంగిస్తున్న సమయంలో టెలిప్రాంప్టర్ మధ్యలోనే ఆగిపోయి నల్లగా మారిపోయిందని, అలాగే సౌండ్ సిస్టమ్ కూడా పనిచేయలేదని తెలిపారు. తన భార్య మెలానియాకు కూడా తన ప్రసంగం వినిపించలేదని చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలు యాదృచ్ఛికంగా జరగలేదని, కచ్చితంగా కుట్ర ప్రకారమే జరిగాయని ట్రంప్ అన్నారు. ఎస్కలేటర్ ఆగిపోయిన ఘటనకు సంబంధించిన సెక్యూరిటీ టేపులను భద్రపరచాలని, సీక్రెట్ సర్వీస్ వాటిని పరిశీలిస్తుందని తెలిపారు.
అయితే, ట్రంప్ ఆరోపణలపై ఐరాస అధికారులు భిన్నమైన వివరణ ఇస్తున్నారు. ట్రంప్ కంటే ముందుగా పరిగెత్తిన అమెరికా ప్రతినిధి బృందంలోని ఓ వీడియోగ్రాఫర్, ప్రమాదవశాత్తూ ఎస్కలేటర్ స్టాప్ బటన్‌ను నొక్కి ఉండవచ్చని ఐరాస ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ చెప్పారు. ఇక, టెలిప్రాంప్టర్ నిర్వహణ బాధ్యత వైట్‌హౌస్‌దేనని, దానితో తమకు సంబంధం లేదని ఓ ఐరాస అధికారి స్పష్టం చేశారు.
కాగా, ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం తీవ్రమైన నిధుల కొరతతో సతమతమవుతోంది. ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా న్యూయార్క్, జెనీవా కార్యాలయాల్లో తరచూ ఎస్కలేటర్లు, లిఫ్టులను ఆపేస్తున్నారు. ఐరాసకు అతిపెద్ద దాత అయిన అమెరికా నుంచే నిధుల విడుదలలో జాప్యం జరగడం ఈ సంక్షోభానికి ఒక కారణంగా కనిపిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com