Donald Trump: బంగారంపై సుంకాలు ఉండవు.. ట్రంప్ కీలక ప్రకటన

అంతర్జాతీయ మార్కెట్లను కొన్ని రోజులుగా కలవరపెడుతున్న ఊహాగానాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరదించారు. బంగారం దిగుమతులపై తమ ప్రభుత్వం ఎలాంటి సుంకాలు (టారిఫ్‌లు) విధించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' లో ఒకే ఒక్క వాక్యంతో "బంగారంపై సుంకాలు ఉండవు!" అని పోస్ట్ చేశారు. దీంతో పసిడి వాణిజ్యంపై నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లయింది.
ఇటీవల స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి అయ్యే 1 కిలోగ్రాము, 100 ఔన్సుల గోల్డ్ బార్స్‌పై అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం సుంకాలు విధించవచ్చని ఒక వార్త హల్‌చల్ చేసింది. ఈ వార్తలతో బంగారంపై దేశాలవారీగా సుంకాలు విధిస్తారేమోనన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఈ రకం గోల్డ్ బార్స్‌ను కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో ఫ్యూచర్స్ కాంట్రాక్టుల కోసం, అలాగే ఆభరణాల తయారీ, పారిశ్రామిక అవసరాల కోసం ఎక్కువగా వినియోగిస్తారు. సుంకాలు విధిస్తే అంతర్జాతీయంగా బంగారం సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్విస్ తయారీదారుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటనతో మార్కెట్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com