Trump: పుతిన్-జెలెన్‌స్కీ భేటీపై ట్రంప్ కీలక ప్రకటన

Trump: పుతిన్-జెలెన్‌స్కీ భేటీపై ట్రంప్ కీలక ప్రకటన
X
ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందంపై పురోగతి

ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందంపై ట్రంప్ పట్టుసాధిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు కూడా జరిపింది. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి చర్చలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆగస్టు 15న అలాస్కా వేదికగా పుతిన్‌తో ట్రంప్ సమావేశం అయ్యారు. 3 గంటల పాటు ఇద్దరి మధ్య చర్చలు నడిచాయి. కానీ యుద్ధం ముగింపుపై ఎలాంటి ప్రకటన రాలేదు. పుతిన్ షరతులు విధించారు. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో సంభాషించారు.

ఇక ట్రంప్ ఆహ్వానం మేరకు జెలెన్‌స్కీ సోమవారం అమెరికాకు వెళ్లారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జెలెన్‌స్కీ సమావేశం అయ్యారు. గత ఫిబ్రవరిలో ఇద్దరి మధ్య హాట్‌హాట్‌గా సమావేశం జరగడంతో జెలెన్‌స్కీ వెంట యూరోపియన్ దేశాధినేతలు, నాటో అధికారులు కూడా వెంట వచ్చారు. యుద్ధం ముగింపుపై జెలెన్‌స్కీ, యూరోపియన్ నేతలతో ట్రంప్ చర్చలు జరిపారు. పుతిన్ చర్చలను కూడా వివరించారు. ఉక్రెయిన్‌కు భద్రతా హామీ ఇవ్వాలంటూ యూరోపియన్ నేతలు ఒత్తిడి తెచ్చారు.

ఇక సమావేశం అనంతరం ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పుతిన్-జెలెన్‌స్కీ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ కూడా అంగీకరించినట్లు ట్రంప్ వెల్లడించారు.

ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి చర్చలకు దగ్గర పడుతున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్.. మాస్కో, కైవ్‌లతో పనిచేస్తున్నారని ట్రంప్ అన్నారు. పుతిన్-జెలెన్‌స్కీ సమావేశంతో యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

‘‘విశిష్ట అతిథులతో నాకు చాలా మంచి సమావేశం జరిగింది. ఇది ఓవల్ కార్యాలయంలో ముగిసింది.’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో అన్నారు. ఉక్రెయిన్‌కు భద్రతా హామీలపై ఈ సమావేశం దృష్టి సారించిందని.. వాషింగ్టన్‌తో యూరోపియన్ దేశాలు సమన్వయం అందించాల్సి ఉందని ట్రంప్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌కు శాంతి నెలకొనే అవకాశం ఉన్నందున అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.’’ అని అన్నారు. వైట్ హౌస్‌లో హాజరైన నాయకుల్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఫిన్నిష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ఉన్నారు.

సమావేశం ముగింపులో పుతిన్‌కు నేరుగా ఫోన్ చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. జెలెన్‌స్కీతో సమావేశానికి పుతిన్ అంగీకరించారని తెలిపారు. ప్రస్తుతం త్రైపాక్షిక సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ట్రంప్ స్పష్టం చేశారు.

Tags

Next Story