Trump: స్వీయబహిష్కరణ చేసుకోవాలనుకుంటే విమాన ఖర్చులు, నగదు కూడా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినదగ్గరి నుంచి వలసల విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో అక్రమంగా ఉంటూ స్వీయబహిష్కరణ చేసుకోవాలనుకునే వారికి ట్రంప్ ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించారు. అలాంటివారికి విమాన ఖర్చులతో పాటు కొంత నగదు అందిస్తామని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్నవారిపై ఇమిగ్రేషన్ అధికారులు దృష్టిసారించారన్నారు. అయితే, చట్టవిరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయబహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలా వెళ్లాలనుకునేవారికి తాము విమాన ఖర్చులతో పాటు కొంత నగదును అందిస్తామని ప్రకటించారు. వెళ్లిపోయినవారిలో మంచివారు ఉంటే వారిని వెనక్కి తీసుకోవడం పైనా ట్రంప్ మాట్లాడారు. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే తమ ప్రథమ లక్ష్యమని ఆయన ఈసందర్భంగా స్పష్టంచేశారు. అయితే, సముచితమని భావిస్తే వారు చట్టపద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు.
అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. కఠిన నిర్ణయాలతో వారిని దేశం నుంచి సాగనంపే ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక, ఇటీవల యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సైతం అక్రమ వలసదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్నవారు కచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని తెలిపింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. నేరం కింద పరిగణించి అపరాధ రుసుం, జైలు శిక్షలు విధిస్తామని హెచ్చరించింది. అందుకే ఇప్పుడే సొంతంగా వెళ్లిపోవాలని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com