Trump: నన్ను అరెస్ట్ చేస్తారేమో..

Trump: నన్ను అరెస్ట్ చేస్తారేమో..
జార్జియా ఎన్నికల ఫలితాల్లో జోక్యం కేసుల్లో గురువారం అరెస్టే అంటున్న ట్రంప్

ఎన్నికల ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు భయం పట్టుకుంది. జార్జియా ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకున్నట్లు దాఖలైన కేసులో ట్రంప్ లొంగిపోవాల్సి ఉన్న నేపథ్యంలో గురువారం జార్జియా వెళ్లనున్న అతను అక్కడ రాడికల్ వామపక్ష డిస్ట్రిక్ట్ అటార్ని ఫాని విల్లీస్ తనను అరెస్టు చేసే ప్రమాదం ఉందని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్నంతా బైడెన్ ఆధీనంలోని డిపార్ట్ మెంట్ఆఫ్ జస్టిస్ సమన్వయం చేస్తోందని ఆరోపించారు.

ఈ ఏడాది ట్రంప్ దాఖలైన 4 క్రిమినల్ కేసుల్లో ఇదొకటి. మరోవైపు....అధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న వారితో బుధవారం ఫాక్స్ న్యూస్ నిర్వహించే టీవీ చర్చలో పాల్గొనబోనని ట్రంప్ ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ ఓటర్లుగా నమోదైనవారు, తమ పార్టీ తరఫున దేశాధ్యక్ష పదవికి అంతిమ అభ్యర్థి ఎవరో తేల్చడానికి ప్రైమరీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని ఆశిస్తున్నవారు టీవీ చర్చల్లో పాల్గొని ఎదుటివారి విధానాల కన్నా తమ విధానాలు ఎలా గొప్పవో వివరిస్తారు. రిపబ్లికన్ ఓటర్ల మనోగతం తెలిపే వివిధ సర్వేల్లో ట్రంప్ అందరి కన్నా ముందున్నట్లు తేలింది.

ఎన్ని కేసులను ఎదుర్కొంటున్నా సరే ప్రచారంలో దూసుకుపోతున్న ట్రంప్ సంప్రదాయ వాద ఓటర్లను ఆకట్టుకునేందుకు మరోసారి సుంకాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాల స్థాయిలోనే భారత్ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించాలని స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వచ్చాక ప్రతీకార సుంకాలను విధిస్తానని తేల్చి చెప్పారు. భారత్ లో అమెరికాకు చెందిన ప్రీమియం హార్లీ-డేవిడ్ సన్ బైక్స్ పై భారీ స్ధాయిలో పన్ను విధిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తమ దేశానికి చెందిన కొన్ని ఉత్పత్తులపై భారత్ లో అధిక పన్నులు విధిస్తున్నారని, తాను తిరిగి 2024లో అధికారంలోకి వస్తే వారిపై అంతే స్ధాయిలో ఎదురు పన్నులు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story