Donald Trump: కెనడాపై 100 శాతం టారిఫ్ లు... ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా ప్రధాని మార్క్ కార్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైనాతో వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకు వెళ్తే కెనడాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా కెనడా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై 100 శాతం సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో కెనడాను చైనా సజీవంగా మింగేస్తుందని, ఆ దేశ జీవన విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు.
కెనడాను ప్రధాని మార్క్ కార్నీ ఒక 'డ్రాప్ ఆఫ్ పోర్ట్'గా (అదనపు సుంకాలను తప్పించుకునే కేంద్రం) భావిస్తే అది తప్పిదమే అవుతుందన్నారు. ఒకవేళ చైనాతో కెనడా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే, కెనడా నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. చైనా కెనడాను మింగేయడమే కాకుండా, వ్యాపారాలను, సామాజిక నిర్మాణాన్ని, జీవన విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, చైనాతో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు కెనడా ప్రధాని కార్నీ ఇటీవల ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా కెనడియన్ కార్మికులు, వ్యాపారులకు లాభం చేకూరుతుందని తెలిపారు. కెనడా ఆహార ఉత్పత్తులపై చైనా విధిస్తున్న తక్కువ సుంకాలకు ప్రతిగా, చైనా ఎలక్ట్రిక్ కార్లపై కెనడా విధించిన 100 శాతం సుంకాలను తగ్గించేందుకు అంగీకరించామని కార్నీ వెల్లడించారు.
అదేవిధంగా అమెరికా ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ ప్రాజెక్టును కెనడా తిరస్కరించడంపై కూడా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కెనడా ప్రధాని కార్నీపై ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
