OPT program: త్వరలో ఓపీటీ రద్దు?

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకుకేంద్రంగా ఉన్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కార్యక్రమాన్ని త్వరలో రద్దు చేసే లేదా పరిమితం చేసే ప్రతిపాదన అమెరికా అంతర్గత భద్రతా శాఖ వద్ద సిద్ధంగా ఉంది. ఈ ప్రతిపాదిత ఇమిగ్రేషన్ నిబంధన 2025 చివరిలో లేదా 2026 ఆరంభంలో అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇది అమలైతే విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకుని, ఆపై పనిచేయడానికి ఉన్న అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపీటీ కార్యక్రమం ద్వారా, అంతర్జాతీయ విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన తర్వాత లేదా మధ్యలో తమ అధ్యయన రంగానికి సంబంధించిన ఉద్యోగంలో 12 నెలల పాటు పనిచేయడానికి అనుమతి లభిస్తుంది.
ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విద్యార్థులకు అదనంగా 24 నెలల పొడిగింపు కూడా ఉంటుంది. ఈ పథకం ద్వారా ఏటా సుమారు 2,50,000 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనికి విరుద్ధంగా మాట్లాడారు. విదేశీ విద్యార్థులను యూఎస్ ఉన్నత విద్యా సంస్థల ఆర్థిక స్థిరత్వానికి కీలకంగా తాను చూస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులలో సగం మందిని తగ్గించినట్టయితే, అమెరికాలోని సగం కళాశాలలు మూతపడతాయని హెచ్చరించారు. ఈ వ్యవస్థ అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
అమెరికాలో తగినంత నిపుణులు లేరు!
విదేశీ ఉద్యోగులు ముఖ్యంగా భారతీయ వలసదారులను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై అనూహ్య స్పందన వ్యక్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఈ వీసా ప్రోగ్రామ్‌ని గట్టిగా సమర్థించారు. ఆయా రంగాలలో నైపుణ్యం కలిగిన స్వదేశీ ఉద్యోగులు లేని కారణంగా విదేశాల నుంచి నైపుణ్యం తెచ్చుకోవడం దేశానికి అవసరమంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికన్ ఉద్యోగుల జీతాలను తగ్గించగలవన్న భయంతోనే హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను మీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందా అని ఫాక్స్ న్యూస్ ప్రతినిధి ప్రశ్నకు అవునని ట్రంప్ సమాధానమిస్తూ.. అయితే దేశానికి నిపుణుల అవసరం కూడా ఉందని స్పష్టం చేశారు. మన వద్ద నిపుణులైన సిబ్బంది లేరని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

