ట్రంప్ అత్యంత చెత్త అధ్యక్షుడు : బైడెన్

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి ముఖాముఖి చర్చ చాలా వాడివేడీగా సాగింది. ట్రంప్‌ను అత్యంత చెత్త అధ్యక్షుడు అంటూ జో బైడెన్ తీవ్ర ఆరోపణలు చేశారు.. రిపబ్లిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ వివిధ అంశాలపై తమ వాదనను ప్రజలకు వివరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక, కరోనాపై ప్రభుత్వ వైఫల్యం, దేశంలో పెరిగిన నిరుద్యోగం, పన్నులు.. ఎకనమీ తదితర అంశాలపై ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఒబామా కేర్ పాలసీని అధ్యక్షుడు ట్రంప్ నీరుగార్చారని బైడెన్ విమర్శించారు. ట్రంప్ విధానం వల్లే వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. మహమ్మారి కరోనాను ఎదుర్కొవడంలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. ఆరోగ్య బీమాను రద్దు చేయలేదని ప్రజలకు ఆరోగ్యసేవలను తక్కువ ధరలో అందించే ప్రయత్నం చేశామని అన్నారు.
దేశ వ్యాప్తంగా నల్లజాతీయులపై పెరిగిన దాడులపైనా ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.. నల్లజాతీయుల ఆందోళనలు పెరగడానికి ట్రంప్ పరిపాలనే కారణమని జో బైడెన్ ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచానికి డెమోక్రాటిక్ పార్టీనే కృత్రిమ ఆందోళనలను తెరపైకి తీసుకొచ్చిందని ట్రంప్ విమర్శించారు.
అమెరికాలో రోజు రోజుకూ పెరుగుతున్న పన్నులు.. ఉద్యోగ కల్పన లేకపోవడం ఇతర అంశాలపై ట్రంప్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు జో బైడెన్.. ఇప్పటి వరకు అమెరికాను పాలించిన వాళ్లలో ట్రంప్ అత్యంత చెత్త అధ్యక్షుడని.. అసలు ఏ అంశంపై ఆయనకు అవగాహన లేదని బైడెన్ ఆరోపించారు. అయితే బైడెన్ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ట్రంప్.. బైడెన్ చెప్పేవి అన్ని అబద్ధాలే అన్నారు. త్వరలోనే మరో డిబేట్‌లో మళ్లీ ట్రంప్..జోబైడెన్ చర్చలో పాల్గొనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

