US-Iran: తక్షణమే ఇరాన్ ఖాళీ చేయాలని అమెరికన్లకు ట్రంప్ వార్నింగ్

మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఒమన్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరుగుతుండగానే ట్రంప్ దగ్గర నుంచి తీవ్ర వార్నింగ్‌లు వచ్చాయి. చర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అణు ఒప్పందంపై చర్చించేందుకు ఇరాన్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో మరోసారి రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే తక్షణమే అమెరికన్లు ఇరాన్‌ను విడిచిపెట్టాలని అమెరికా అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ నుంచి బయలుదేరడానికి సిద్ధం కావాలని అమెరికన్లకు తాజాగా ఆదేశాలు వెళ్లాయి. ఇరాన్‌లోని తమ పౌరులు వెంటనే పశ్చిమాసియా దేశాన్ని విడిచి వెళ్లాలని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్‌లోని యూఎస్ ఎంబసీ సలహా జారీ చేసింది. దేశ వ్యాప్తంగా అశాంతి, ప్రయాణ అంతరాయాలు కొనసాగుతున్నందున వెంటనే దేశం విడిచి వెళ్లాలని కోరింది.
ఇక అమెరికా పౌరులు ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ మార్గాలను ప్లాన్ చేసుకోవాలని కోరింది. అర్మేనియా లేదు టర్కీ వెళ్లిపోవాలని సూచించింది. విమాన సంస్థలను నేరుగా సంప్రదించాలని తెలిపింది. ఒకవేళ వెళ్లడం సాధ్యం కాకపోతే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని చెప్పింది. ఆహారం, నీరు, మందులు, ఇతర ముఖ్యమైన వస్తువులు దగ్గర ఉంచుకోవాలని కోరింది. అలాగే ఫోన్ ఛార్జ్‌లో ఉంచుకోవాలని సూచించింది. నిరంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులతో టచ్‌లో ఉండాలని హెచ్చరించింది.
గత డిసెంబర్ 28 నుంచి ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. ఈ నిరసనల్లో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే రక్తపాత అణచివేతకు ప్రతిస్పందనగా దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక ఇప్పటికే అరేబియా సముద్రంలో మోహరించింది. అలాగే అమెరికా యుద్ధ విమానాలు కూడా చేరుకున్నాయి. అయితే అణు కార్యక్రమంపై ఇరాన్ చర్చించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. అరబ్ దేశాలు మధ్యవర్తిత్వం వహించి అమెరికాను ఒప్పించేందుకు ప్రయత్నించినా విఫలమైనట్లుగా సమాచారం. మొత్తం మీద మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏమవుతుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
