Donald Trump: తమ జోలికి ఎవరు వచ్చినా వదిలి పెట్టేది లేదన్న డొనాల్డ్ ట్రంప్

మరిన్ని భీకర దాడులు చేస్తామని, ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ, తమ జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని తీవ్ర దాడులు ఉంటాయని తెలిపారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, వారు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యాన్ని అమెరికా కలిగి ఉందని, దానిని ఇప్పుడు ఉపయోగిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సాఫీగా, తమకు ఎలాంటి ఇబ్బందిలేకుండా సాగుతోందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. ఇరాన్ ప్రజలు నియంత పాలన నుంచి స్వేచ్ఛ పొందడానికి అమెరికా ఈ సైనిక చర్యకు ఉపక్రమించిందని అన్నారు.
ఇరాన్ ఇలాగే దాడులు కొనసాగిస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్‌పై అసలైన దాడిని ఇంకా ప్రారంభించలేదని, ఆ దేశం ఇలాగే వ్యవహరిస్తే దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఆయన సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి
యుద్ధం విషయంలో తమ దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, చర్చలు జరుగుతాయో.. లేదో తాను చెప్పలేనని పేర్కొన్నారు. ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ, మిలిటరీ దళాలు ఆయుధాలు వీడితే వారికి రక్షణ కల్పిస్తామని ట్రంప్ భరోసా ఇచ్చారు. లేదంటే చావు తప్పదని హెచ్చరించారు. తన ఆఫర్‌ను వాడుకొని ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ పొందాలని పిలుపునిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ స్పందించారు.
అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘ఈ యుద్ధాన్ని మేం మొదలు పెట్టలేదు. ట్రంప్ తన తప్పుడు ఆకాంక్షలతో ఈ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. ఇజ్రాయెల్ కూడా తన అధికార కాంక్షతో అమెరికా సైనికులను కూడా బలి పెడుతున్నది’ అంటూ అలీ మండిపడ్డారు. కాగా.. ఈ యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదని, ఇరానే మొదలు పెట్టిందని అమెరికా సైన్యం తెలిపింది. యుద్ధాన్ని ముగించేది తామేనని పేర్కొన్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
