ట్రంప్‌ను బలవంతంగా కుర్చీ నుంచి దింపే ప్రయత్నాలు ...

ట్రంప్‌ను బలవంతంగా కుర్చీ నుంచి దింపే ప్రయత్నాలు ...
ట్రంప్‌ను బలవంతంగా కుర్చీ నుంచి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్‌పై మరోసారి అభిశంసన తీర్మానాన్ని ప్రయోగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ట్రంప్‌ను బలవంతంగా కుర్చీ నుంచి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్‌పై మరోసారి అభిశంసన తీర్మానాన్ని ప్రయోగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. విచిత్రంగా రిపబ్లికన్‌ పార్టీ నేతలు కూడా ట్రంప్‌ను దించేయాల్సిందేనని మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికైతే అభిశంసనపై చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. ట్రంప్‌ తనంతట తాను తప్పుకుంటే సరే సరి. లేదంటే రేపే అభిశంసన ప్రయోగించి ట్రంప్‌ను గద్దె దించాలని భావిస్తున్నారు. దీనిపై డెమొక్రటిక్ పార్టీ నేతలు ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చారు.

అమెరికా కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్‌ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటి వరకూ ట్రంప్ అధ్యక్షుడిగానే కొనసాగుతారు. కాని, ఈలోపే అమెరికాలో పరిస్థితి అదుపు తప్పొచ్చన్న అనుమానాలు, భయాలు కలుగుతున్నాయి. ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం.. క్యాపిటల్‌ భవనంపై దాడి తరువాత అమెరికాలోని శ్వేత జాతీయులకు కొత్త ఉత్సాహం వచ్చిందట. నల్లజాతీయులను వ్యతిరేకిస్తున్న వీళ్లు.. 20వ తేదీ లోపు మరిన్ని దాడులకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్‌ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

క్యాపిటల్‌ భవనంపై దాడిని స్వయంగా ప్రోత్సహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్‌ను తక్షణం అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు. దీనిపై ఇప్పటికే చర్చిస్తున్న డెమొక్రాట్‌ కాంగ్రెస్‌ సభ్యులు.. ట్రంప్‌ను అభిశంసించే ప్రక్రియను సోమవారం మొదలుపెట్టాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈలోపు ట్రంప్‌ స్వచ్ఛందంగా వైదొలగితే ఫర్వాలేదని, లేదంటే రెండోసారి అభిశంసించడానికి వెనుకాడబోమని స్పీకర్‌ నాన్సీ పెలోసీతో పాటు కొందరు డెమొక్రాట్లు వార్నింగ్‌ కూడా ఇచ్చారు.

ట్రంప్‌పై రేపే అభిశంసన తీర్మానాన్ని ప్రయోగించినా దాన్ని ఆమోదించి, సెనేట్‌కు వెళ్లి, అక్కడ కూడా ఆమోదించే సరికే ట్రంప్ పదవీకాలం పూర్తవుతుంది. జనవరి 20 తేదీ కూడా వచ్చేస్తుంది. అయినా సరే.. ట్రంప్‌ను అభిశంసించాలనే ప్రక్రియను వేగవంతం చేసి ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డెమొక్రాట్లు బలంగా నిర్ణయించుకున్నారు. అయితే, బైడెన్ మాత్రం ఈ రాజకీయాలనేం పట్టించుకోవడం లేదు.

అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్న బైడెన్‌.. ఈ ప్రతికూల వాతావరణాన్ని, రిపబ్లికన్‌ పార్టీతో విభేదాలను కోరుకోవడం లేదని తెలుస్తోంది. కరోనా నియంత్రణ, ఇమిగ్రేషన్‌ విధానాల మార్పులపై మాత్రమే ప్రధానంగా దృష్టి సారించి, వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టాలనుకుంటున్నారు తప్ప రాజకీయ వ్యవహారాలపై ఆసక్తిగా లేరని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story