Donald Trump: అక్రమ వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం బంపర్ ఆఫర్..అమెరికా వీడితే అంత డబ్బా ?

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు స్వచ్ఛందంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు ట్రంప్ ప్రభుత్వం ఓ భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది చివరిలోగా దేశం విడిచి వెళ్లేవారికి 3,000 డాలర్లు (సుమారు రూ. 2.7 లక్షలు) నగదుతో పాటు ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని డిసెంబర్ 22న హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) వెల్లడించింది.
ఈ పథకంలో చేరేవారికి దేశం విడిచి వెళ్లనందుకు విధించిన సివిల్ జరిమానాలను కూడా రద్దు చేయనున్నట్లు DHS స్పష్టం చేసింది. ఇందుకోసం వలసదారులు 'CBP హోమ్' అనే మొబైల్ యాప్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. "ఈ పండుగ సీజన్‌లో అక్రమ వలసదారులు తమకు, తమ కుటుంబాలకు ఇచ్చుకోగల అత్యుత్తమ బహుమతి ఇదే. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సమాచారం నింపితే చాలు, మిగతా ప్రయాణ ఏర్పాట్లన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది" అని DHS ఒక ప్రకటనలో పేర్కొంది.
అయితే, ఈ ఆఫర్‌ను వినియోగించుకోని వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ మాట్లాడుతూ.. "ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, మేము వారిని గుర్తించి, అరెస్ట్ చేసి, దేశం నుంచి బహిష్కరిస్తాం. వారు మళ్లీ అమెరికాలోకి ఎప్పటికీ అడుగుపెట్టలేరు" అని తేల్చిచెప్పారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 1.9 మిలియన్ల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లారని, వేలాది మంది CBP హోమ్ యాప్‌ను ఉపయోగించారని క్రిస్టీ నోయెమ్ తెలిపారు. గతంలో మే నెలలో 1,000 డాలర్లుగా ఉన్న ప్రోత్సాహకాన్ని ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా మూడు రెట్లు పెంచినట్లు ఆమె పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

