Donald Trump: వలసదారులకు పౌరసత్వం కోసం బిగ్‌బాస్ తరహా రియాలిటీ షో

అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టిన వారి పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అధికారులు వారిని వెతికి పట్టుకుని వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే పలువురిని సంకెళ్లతో వెనక్కి పంపగా.. ఆయా దేశాలు ట్రంప్ తీరును తీవ్రంగా నిరసించాయి. అమెరికా కోర్టులు కూడా వలసదారులను వెనక్కి పంపుతున్న తీరును తప్పుబట్టాయి. దీంతో వలసదారులను వెనక్కి పంపించే కార్యక్రమం కాస్త నెమ్మదించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సంచలన వార్త అమెరికా మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది.
వలసదారులకు చివరి అవకాశం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఓ రియాలిటీ షోకు ప్లాన్ చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ రియాలిటీ షోలో పాల్గొని అంతిమంగా విజేతగా నిలిచిన వారికి అమెరికా పౌరసత్వం బహుమానంగా అందించనున్నట్లు సమాచారం. ఈ అంశం పరిశీలనలో ఉందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కూడా వెల్లడించింది. అయితే, ఇది వలసదారులను ఉద్దేశించి నిర్వహించే హంగర్ గేమ్ కాదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదన ఇంకా ఆమోదం కానీ తిరస్కరణ కానీ పొందలేదని తెలిపారు.
ఈ షోలో పాల్గొనేవారు అమెరికా పట్ల తమ దేశభక్తిని నిరూపించుకునేలా పోటీలు ఉంటాయని తెలుస్తోంది. గోల్డ్ రష్, కార్ అసెంబ్లీ వంటి టాస్క్‌లు పూర్తి చేయాల్సి ఉంటుందట. ఎల్లిస్ ఐలాండ్‌లో ప్రారంభం కానున్న ఈ షోలో ప్రతి ఎపిసోడ్‌కు ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం వివిధ వర్గాలకు చెందిన వలసదారుల తాత్కాలిక రక్షణ హోదాను రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ షో గురించిన వార్తలు వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com