Turbulence: స్పానిష్ విమానంలో భారీ కుదుపులు.
ఎయిర్ యూరోపా కు చెందిన ఓ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. దీంతో విమానాన్ని బ్రెజిల్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ది న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఎయిర్ యూరోపా బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం 325 మంది ప్రయాణికులతో సోమవారం స్పెయిన్ లోని మాడ్రిడ్ నుంచి ఉరుగ్వే రాజధాని మాంటెవీడియో కు బయల్దేరింది. అయితే మార్గం మధ్యలో విమానంలో అల్లకల్లోలం నెలకొంది. తీవ్రమైన కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు వారి సీట్ల నుంచి కిందపడిపోయారు. ఓ ప్రయాణికుడు ఏకంగా ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు.
ఈ ఘటనతో విమానాన్ని ఈశాన్య బ్రెజిల్‌లోని నాటల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపినట్లు ది న్యూయార్క్ పోర్ట్ వెల్లడించింది. అక్కడ విమానం ఎలాంటి సమస్య లేకుండా సురక్షితంగా ల్యాండ్ అయినట్లు పేర్కొంది. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఇటీవలే లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న విమానం, దోహా నుంచి డబ్లిన్‌కు వెళ్తున్న ఖతార్ విమానంలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ రెండు ఘటనల్లోనూ పలువురు గాయపడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com