Turkey Earth Quake: పిల్లి ప్రేమకు పులకించిపోతోన్న జవాను..

టర్కీ, సిరియా ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిపోయింది. లెక్కలేనంత విషాదాన్ని మిగిల్చింది. ఎటుచూసినా అర్తనాదాలే... ఇక వీధి వీధినా బారులు తీరుతున్న శవపేటికలకు లెక్కే లేదు. ఇంతటి విషాదకర సమయంలోనూ హృదయాన్ని హత్తుకుంటోన్న ఘటనలు మనిషిలో మళ్లీ ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తనను ప్రాణాపాయం నుంచి కాపాడిన వ్యక్తి తోడు వీడనంటోన్న ఓ మార్జాలం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సహాయక చర్యల్లో పాలుపంచుంకుంటోన్న వ్యక్తి వెంటే తిరుగుతోంది. అతడి నుంచి ఎవరైనా దూరంగా తీసువెళ్లటానికి ప్రయత్నిస్తున్నా అది ఊరుకోవడంలేదని తెలుస్తోంది. ఇక ఈ పిల్లని దగ్గర తీసుకున్న వ్యక్తి సైతం దాని తోడు వీడననే చెబుతున్నాడు. పిల్లిని రక్షించిన తరువాత దానికి ఎన్కాజ్ అని నామకరణం చేసినట్లు వెల్లడించాడు. తాను ఏది తింటే దానికీ అదే ఇస్తున్నట్లు తెలిపాడు. అయితే పిల్లిని పెంచుకుంటోన్న యజమాని కోసం గాలిస్తున్నామని, ఒకవేళ అతడు వస్తే సరేసరి, లేకుంటే తానే ఎన్కాజ్ ను పెంచుకుంటానంటున్నాడు. ఇదో మధురమైన జ్ఞాపకమని వెల్లడించాడు. ఏమైనా వీరి అనుబంధంపై నెటిజెన్లు అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. వీరి బంధం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com