Illegal Immigrants:అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న అక్రమ వలసదారులు

అక్రమ వలసదారులను ఏరివేస్తున్న అమెరికా మరో 12 మంది భారతీయులను పనామాకు పంపించింది. బహిష్కరించబడిన వారు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. పనామా నుండి బహిష్కరణ తర్వాత తిరిగి వస్తున్న భారతీయుల మొదటి బ్యాచ్ ఇది. కొన్ని రోజుల క్రితం అమెరికా పనామాకు బహిష్కరించిన 299 మంది వలసదారులలో ఈ 12 మంది భారతీయులు ఉన్నారని భావిస్తున్నారు. అమెరికా ఇప్పటి వరకు మూడు మిలటరీ విమానాల్లో 332 మంది భారతీయులను తిప్పి పంపగా, వారందరికీ సంకెళ్లు వేయడం తెలిసిందే. అయితే, తాజాగా తిప్పి పంపిన 12 మందిని స్వేచ్ఛగా తరలించడం గమనార్హం.
అమెరికా బహిష్కరణ కార్యక్రమానికి పనామా సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగా అక్రమ వలసదారులను అమెరికా పనామాకు తరలిస్తోంది. అక్కడి నుంచి వారు తమ దేశాలకు చేరుకుంటున్నారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న 50 మంది భారతీయులను అమెరికా ఇటీవల పనామాకు తరలించింది. వారిలో 12 మంది నిన్న భారత్ కు చేరుకున్నారు. బహిష్కృతులు స్వదేశాలు చేరుకునేందుకు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్’ సాయం చేస్తోంది. ముఖ్యంగా, విమాన టికెట్లు కొనుగోలులో వారికి సాయం చేస్తోంది. పనామా బహిష్కృతులకు “వారధి” దేశంగా మారుతుందని అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో అంగీకరించిన తర్వాత శరణార్థులు గత వారం మూడు విమానాలలో పనామాకు చేరుకున్నారు.
కాగా, పనామా చేరుకున్న బహిష్కృతుల జాతీయతను భారత విదేశాంగ శాఖ నిర్ధారించిన తర్వాత వచ్చే వారం మరింతమంది స్వదేశం చేరుకునే అవకాశం ఉంది. కాగా, ఈ నెల 5న అమృత్‌సర్ చేరుకున్న అమెరికా మిలటరీ విమానంలో 104 మంది, 15న వచ్చిన రెండో విమానంలో 119 మంది, 16న వచ్చిన మూడో విమానంలో 112 మంది భారత్‌కు చేరుకున్నారు. వీరందరి కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి తీసుకురాగా, తాజాగా ఢిల్లీకి చేరుకున్న 12 మంది మాత్రం ఎలాంటి బంధనాలు లేకుండానే రావడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com