Twitter Row: ఎలాన్ మస్క్ కొత్త డ్రామా.. సీఈఓగా కొనసాగాలా వద్దా అంటూ పోల్!

Twitter Row: ఏ ముహూర్తాన ఎలాన్ మస్క్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించాడో ఆ నాటి నుంచే ట్విట్టర్ వ్యవహారమంతా తిక్క తిక్కగా తయారైంది. తుగ్లక్ పాలనను తలపిస్తున్న మస్క్ వ్యవహారశైలితో ప్రభుత్వాల దగ్గర నుంచి ట్విట్టర్ యూజర్ల వరకూ అందరికీ తిప్పలు తప్పడంలేదు.
నిన్నమొన్నటి వరకూ తన ఉద్యోగులపై ఉక్కుపాదం మోపి చోద్యం చూసి శాడిస్ట్ బాస్ గా పేరుగాంచిన మస్క్, ఇటీవలే జర్నలిస్టులను టార్గెట్ చేసి ఎమర్జెన్సీ పాలనను తలపింపజేశాడు. తాజాగా తాను ట్విట్టర్ సీఈఓగా కొనసాగాలా వద్దా అంటూ పోల్ నిర్వహించాడు. దీంతో ఎలాన్ మస్క్ ను అర్ధం చేసుకోవడం ఎలాగో తెలియక మేధావులు సైతం బుర్రగోక్కుంటున్నారు.
ఆదివారమే ఈ పోలింగ్ ను ప్రారంభించిన ఎలాన్, పోల్ ఫలితాలు ఏది ఏమైనప్పటికీ దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశాడు. ఈరోజు సాయంత్రం గం.4.50ని వరకూ ఈ పోలింగ్ కొనసాగుతుందని తెలిపాడు. ఒకవేళ పోలింగ్ ఫలితాలు అతనికి అనుకూలంగా రాకపోతే ట్విట్టర్ బాధ్యతల నుంచి ఎప్పుడు తప్పుకుంటాడన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఓ ట్విట్టర్ యూజర్ కు సమాధానమిస్తూ తన తరువాత సీఈఓ బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ లేరంటూ ట్వీట్ చేశాడు.
మరోవైపు ట్వీట్టర్ పాలసీలో భారీ మార్పులు తీసుకువచ్చే ప్రయత్నంలో తలమునకలైన మస్క్, మెటా(ఫేస్ బుక్), ఇన్స్టాగ్రామ్ , మాస్టోడన్, ట్రూత్ సోషల్, ట్రిబెల్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లకు పరోక్షంగా చురకలు అంటించాడు. తాజా పాలసీ ప్రకారం ఇతర ఫ్లాట్ ఫార్మ్ లు మాదిరి ట్విట్టర్ లో క్రాస్ కంటెంట్ పోస్టింగ్ కు వీలు లేకుండా పోయింది. అయితే పైన పేర్కొన్న జాబితాలో చైనీయుల సామాజిక మాధ్యమం టిక్ టాక్ లేకపోవడం కొసమెరుపు. మరి ఇక ముందు ముందు ట్విట్టర్ లో ఇంకెన్ని విడ్డూరాలు చూడాల్సి వస్తుందో ఏమో వేచి చూడాల్సిందే!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com