Charlie Kirk: చార్లీ కిర్క్‌ను అందుకే చంపేశా.. నిందితుడు కీలక వ్యాఖ్యలు

అమెరికాలో సంచలనం సృష్టించిన, డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన చేసే ద్వేషపూరిత ప్రసంగాలు నచ్చకే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. వారం రోజుల ముందే పక్కా ప్రణాళిక రచించి, ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
గత బుధవారం ఉతా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా, చార్లీ కిర్క్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కిర్క్ అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. ఘటన జరిగిన 33 గంటల తర్వాత, 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ట్రంప్, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.
పోలీసులు కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం, కిర్క్ ప్రసంగాల్లోని ద్వేషం తనకు విసుగు తెప్పించిందని రాబిన్సన్ భావించాడు. హత్య చేయడానికి గల కారణాలను ముందుగానే ఒక నోట్‌లో రాసిపెట్టాడు. అంతేకాకుండా, "ద్వేషం నాకు విసుగు తెప్పించింది, కొన్ని ద్వేషాలను పరిష్కరించలేం" అని తన భాగస్వామికి పంపిన సందేశాలు దర్యాప్తులో బయటపడ్డాయి. రాబిన్సన్ ప్రస్తుతం లింగమార్పిడి చేసుకున్న వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
స్వలింగ సంపర్కాన్ని, 'గే' వివాహాలను చార్లీ కిర్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పురుషులు-పురుషులు, స్త్రీలు-స్త్రీలు పెళ్లి చేసుకోవడం ప్రకృతి విరుద్ధమంటూ ఆయన బహిరంగ సభల్లో ప్రసంగించేవారు. మరోవైపు నిందితుడు రాబిన్సన్ గత ఏడాది నుంచి స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి హక్కులకు మద్దతు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో కిర్క్ ప్రసంగాలపై కోపంతోనే రాబిన్సన్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ప్రస్తుతం నిందితుడు దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని తెలిసింది. అయితే, కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. నిందితుడిపై మోపిన నేరాలు రుజువైతే జీవిత ఖైదు లేదా 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com