Typhoon : డ్రాగన్‌ను వణికిస్తోన్న బెబింకా
చైనాను బెబింకా తుపాను వణికిస్తోంది. డ్రాగన్ కంట్రీ వాణిజ్య రాజధాని షాంఘై వద్ద 151 కి.మీ వేగంతో బెబింకా తీరందాటింది. బెబింకా ధాటికి షాంఘై నగరం వణికిపోయింది. రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దాదాపు 2 వేల సర్వీసులు రద్దు చేశారు. మెట్రో రైళ్లు, సాధారణ రైళ్లు నిలిపివేశారు. పార్కులు మూసి ఉంచారు. రవాణా స్థంభించిపోయింది. బెబింకా దెబ్బకు కార్లు కొట్టుకుపోయాయి. ప్రజలు కనీస అవసరాల కోసం పాట్లు పడ్డారు. కరెంటు లేకపోవడంతో మొబైల్ ఛార్జింగ్ కూడా సాధ్యం కాలేదు.
1949లో వచ్చిన గ్లోరియా తుపాను తరవాత అతి పెద్ద తుపాను బెబింకా కావడం గమనార్హం.బెబింకా తుపాను దాదాపు లక్ష కోట్ల ఆస్తి నష్టం కలిగించినట్లు తెలుస్తోంది. చైనా ఆర్థిక రాజధాని కోలుకోవడానికి కనీసం 2 నెలల సమయం పట్ట వచ్చని అంచనా వేస్తున్నారు. దాదాపు 2 కోట్ల మంది బెబింకాతో తీవ్ర ఇబ్బందులు పడినట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.
ఇటీవలే చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌ను యాగి తుపాను ఇబ్బందిపెట్టింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిశాయి. దీంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్ అయిపోవడంతో డిజిటల్ చెల్లింపులకు ప్రజలు నానాతంటాలు పడ్డారు. కనీసం నిత్యావసర సరకులు సైతం కొనుగోలు చేయలేని పరిస్థితులు ఎదుర్కొన్నారని పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com