Japan : జపాన్ ను వణికిస్తున్న టైఫూన్

పసిఫిక్ మహాసముద్రంలో టైఫూన్ల సీజన్ నడుస్తోంది. విపరీతంగా గాలులు, కుంభవృష్టితో కలిసి వచ్చే ఈ టైఫూన్లు పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి.ఇక ఇప్పుడు వస్తున్న ఏడో టైఫూన్ జపాన్ కు గురిపెట్టింది. ప్రస్తుతానికి బలంగా కదులుతున్న లాన్ అనే పేరున్న ఈ టైఫూన్ మధ్య జపాన్ భూభాగంపై తన ప్రభావం చూపే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో గంటకు 195 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో గాలులు వీస్తాయని జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) వెల్లడించింది.
ప్రధానంగా ఒసాకా, క్యోటో నగరాల మీదుగా ఈ టైఫూన్ పయనించే అవకాశాలున్నట్టు తెలిపింది. భారీ వర్షాలు, పెనుగాలులు వీస్తాయని, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి వైపరీత్యాలు సంభవిచనున్నాయని ప్రకటించింది. ఈ టైఫూన్ మంగళవారం జపాన్ లోని ప్రధాన ద్వీపం హాన్షులో తీరాన్ని తాకుతుందని తెలుస్తోంది. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో 50 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత తుఫాను బీభత్సం సృష్టించవచ్చని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరిస్తోంది. ఇందువల్ల ఆగస్టులో సగటు వర్షపాతం కంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్య అవకాశం ఉంది. జపాన్ లో ఇప్పుడు వారి సాంప్రదాయ ఒబాన్ సెలవు దినాలు ఉండటంతో ప్రజలు వారి సొంత గ్రామానికి వెళ్లే హడావిడిలో ఉన్నారు.
అయితే శక్తిమంతమైన టైఫూన్ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. తుపాను ప్రభావం చూపించే ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లను కూడా రద్దు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com