Typhoon Yagi: మయన్మార్‌లో యాగీ తుఫాన్ బీభత్సం

Typhoon Yagi: మయన్మార్‌లో యాగీ తుఫాన్ బీభత్సం
X
226 మంది మృతి, మరో 77 మంది మిస్సింగ్..

మొన్నటి వరకు వియత్నాం దేశాన్ని వణికించిన ఈ తుఫాన్.. ఇప్పుడు మయన్మార్‌పై ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. యాగీ తుఫాన్ వల్ల కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. భారీ వరదలు వస్తుండటంతో పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 226 మంది మరణించగా.. మరో 77 మంది తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. లక్షలాది మంది ప్రజలు తాము ఉంటున్న ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఈ తుఫాన్ వల్ల ఇప్పటికే 6.30 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ విపత్తు సంస్థ వెల్లడించింది. వరద బాధితులను ఆదుకునేందుకు భారత్‌ ఆపన్నహస్తం అందించింది. ఆపరేషన్ సద్భవ్‌ను చేపట్టింది . ఆహారం, తాగునీరు, మందులు దుప్పట్లను మయన్మార్‌, వియాత్నం, లావోస్‌కు తరలిస్తున్నట్టు చెప్పారు విదేశాంగ మంత్రి జైశంకర్‌.

కాగా, ఈ యాగీ తుఫాన్ వల్ల ముఖ్యంగా రాజధాని నేపిడావ్ ప్రాంతంతో పాటు కయా, కయిన్ అలాగే షాన్ రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఆహారం, తాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. మయన్మార్ చరిత్రలో ఇంతటి దారుణ తుఫాన్ ఇప్పటి వరకు రాలేదనీ.. అత్యంత దారుణ వరదలు ఇవేని ఐక్యరాజ్యసమితి చెప్పుకొచ్చింది. మయన్మార్‌లో వరదల ధాటికి ఇప్పటి వరకు 2,60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రహదారుల లాంటి మౌలిక సౌకర్యాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. మరోవైపు వరద బాధితులకు సహాయం చేయాలంటే కూడా వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఈ క్రమంలోనే తమకు సాయం చేసేందుకు ముందుకు రావాలని మయన్మార్‌ సైనిక పాలక వర్గం పలు దేశాలని కోరుతుంది. కాగా, యాగీ తుఫాన్ చైనా, వియత్నాం, థాయ్ లాండ్‌, లావోస్‌ దేశాలలోనూ ప్రభావం చూపిస్తుంది. యాగీ తుఫాన్ కారణంగా ఒక్క వియత్నాంలోనే ఇప్పటి వరకు దాదాపు 300 మంది వరకు చనిపోయారు.

Tags

Next Story