అమెరికా అధ్యక్ష ఎన్నికలు : వందేళ్లలో ఎన్నడూ లేనంతగా పోలింగ్

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. అటు అమెరికన్ ఓటర్లు కూడా రికార్డుస్థాయిలో స్పందించారు.. గడిచిన వంద సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఈసారి పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో మొత్తం అర్హులైన ఓటర్ల సంఖ్య 23.9 కోట్లు. వీరిలో దాదాపు 10 కోట్లకుపైగా ఓటర్లు ముందస్తుగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల రోజున దాదాపు 6 కోట్ల మంది ఓటు వేసినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి మొత్తంగా 16 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా అంచనా వేస్తున్నారు. మొత్తం ఓట్లలో ఇది దాదాపు 67శాతం. ఈస్థాయిలో ఓటింగ్ నమోదుకావడం గడిచిన వందేళ్లలో ఇదే తొలిసారి. 1908 సంవత్సరంలో అత్యధికంగా 65.7 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం 67శాతం ఓటింగ్ నమోదైంది. ఈ స్థాయిలో ఓటింగ్ జరగడం ఇదే మొదటిసారి అని యునైటెడ్ స్టేట్స్ ఎలక్షన్ ప్రొజెక్ట్ సంస్థ పేర్కొంది....
కరోనా వైరస్ వల్ల ఏర్పడ్డ పరిస్థితులతో ఈసారి ఎక్కువ సంఖ్యలో పోస్టల్ ఓట్లకు అనుమతి ఇచ్చారు. దీంతో భారీ స్థాయిలో పోలింగ్‌కు ఇది కూడా దోహదం చేసినట్లు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, కొవిడ్ విజృంభణ, జాతి వివక్ష వంటి అంశాలు కూడా ఓటింగ్ శాతం పెరగడానికి కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి అమెరికన్ ఓటర్లలో డెమొక్రాటిక్ పార్టీ మద్దతుదారులు ఎక్కువగా పోస్టల్ ఓటింగ్ వినియోగించుకోగా, రిపబ్లికన్‌లు మాత్రం పోలింగ్ రోజే ఓటు వేసినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com