Russia-Ukraine War: రష్యాపై 140 డ్రోన్లతో ఉక్రెయిన్‌ భారీ దాడి

Russia-Ukraine War:  రష్యాపై 140 డ్రోన్లతో ఉక్రెయిన్‌ భారీ దాడి
అన్నింటినీ కూల్చేసినట్లు రష్యా వెల్లడి

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కోనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగంపై భారీ దాడికి పాల్పడింది. ఉక్రెయిన్‌.. తమ భూభాగంలో ఏకంగా 140కి పైగా డ్రోన్లను ప్రయోగించిందని రష్యా రక్షణశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. అయితే.. తమ భూభాగంలోకి ప్రవేశించిన 144 డ్రోన్లను రాత్రికి రాత్రే కూల్చివేశామని తెలిపారు.

బ్రయాన్స్క్ ప్రాంతంపై 72, మాస్కో ప్రాంతంపై 20, కుర్స్క్ ప్రాంతంపై 14, తులా ప్రాంతంపై 13, దేశంలోని మరో ఐదు ప్రాంతాలపై 25 ప్రయోగించిన డ్రోన్ల కూల్చివేశామని రష్యా సైన్యం తెలిపింది. ఉక్రెయిన్‌ చేసిన భారీ వైమానిక దాడుల్లో మాస్కోలో ఒక మహళ మృతి చెందినట్లు మాస్కో ప్రాంతీయ గవర్నర్ ఆండ్రీ వోరోబయోవ్ వెల్లడించారు. దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

మరోవైపు.. ఈ దాడుల కారణంగా నాలుగు విమానాశ్రయాల్లో కొన్ని విమానాలను రద్దు చేసి, మరికొన్నింటిని వాయిదా వేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. ఇటీవల ఇరుదేశాల మధ్య దాడుల తీవ్రత పెరుగుతోంది. అదేవిధంగా రాత్రి సమయంలో భీకరంగా వైమానిక దాడులకు ఇరు దేశాలు తెగబడటం గమనార్హం.

Tags

Next Story