Ukraine - France: రష్యా యుద్ధానికి ఫ్రాన్స్ నుంచి 100 రాఫెల్ జెట్లు!

Ukraine - France:  రష్యా యుద్ధానికి ఫ్రాన్స్ నుంచి 100 రాఫెల్ జెట్లు!
X
రష్యా వార్‌కు ఉక్రెయిన్ భారీ డీల్..

రష్యా వార్‌లోకి ఫ్రాన్స్ రాఫెల్ యుద్ధ విమానం అడుగు పెట్టబోతుంది. రాబోయే 10 ఏళ్లలో100 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి తాజాగా ఉక్రెయిన్ ఫ్రాన్స్‌తో ఉద్దేశ్య లేఖపై సంతకం చేసిందని ఫ్రెంచ్ అధ్యక్ష భవనం ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఫ్రాన్స్‌ను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో రాఫెల్ ఫైటర్ జెట్లపై చర్చలు జరిపారు. రష్యా ఇటీవల ఉక్రెయిన్‌పై డ్రోన్, క్షిపణి దాడులను పెంచింది. ఈక్రమంలో ఉక్రెయిన్ యుద్ధ శిబిరంలో రాఫెల్ జెట్లు చేర్చుకోవాలని కీవ్ అభిప్రాయపడుతుంది.

రాఫెల్ జెట్‌లు ఉక్రెయిన్ వైమానిక రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి. ఈ ఒప్పందం కేవలం జెట్‌లకే పరిమితం కాదని, ఇందులో వైమానిక రక్షణ వ్యవస్థలు, బాంబులు, డ్రోన్‌లు కూడా ఉన్నాయని మాక్రాన్ పేర్కొన్నారు. ఈ విమానాలను ఫ్రాన్స్ వద్ద ఉన్న స్టాక్ నుంచి విక్రయించరు. వీటిని కొత్త తయారీ కేంద్రం నుంచి కీవ్‌కు సరఫరా చేయనున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది. ఉక్రెయిన్ సైన్యం పునర్నిర్మించడానికి 100 రాఫెల్ జెట్‌లు అవసరమని మాక్రాన్ పేర్కొన్నారు.

లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే..

లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది క్షిపణిని కొనుగోలు చేయాలనే కోరికను వ్యక్తపరిచే ఒక రాజకీయ ఒప్పందం. అసలు కొనుగోలు తరువాత జరుగుతుంది. ఈ కొనుగోలుకు రష్యన్ డబ్బు, యూరప్‌లో ఉన్న ఆస్తులతో నిధులు సమకూర్చాలనేది ప్రణాళిక. అయితే ఈ ప్రణాళికను యూరోపియన్ యూనియన్ (EU) ఇంకా ఆమోదించలేదు. డసాల్ట్ సహా ఫ్రెంచ్ ఆయుధ కంపెనీలతో కూడా జెలెన్స్కీ సమావేశాలు నిర్వహించారు. రాఫెల్ జెట్‌లను నడపడానికి పైలట్‌లకు విస్తృతమైన, కఠినమైన శిక్షణ అవసరం. ఫ్రాన్స్ ఇప్పటికే మిరాజ్ జెట్‌లు, ఆస్టర్ 30 క్షిపణులను కీవ్‌కు అందజేస్తామని ప్రతిజ్ఞ చేసింది.

రష్యాతో శాంతి ఒప్పందం తర్వాత ఉక్రెయిన్ లేదా దాని పశ్చిమ సరిహద్దు ప్రాంతాలకు దళాలు, సైనిక వనరులను పంపగల దాదాపు 30 దేశాలతో కూడిన కూటమిని ఏర్పాటు చేయడానికి ఫ్రాన్స్, బ్రిటన్ ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు దీర్ఘకాలిక సైనిక, ఆర్థిక సహాయాన్ని అందించడం, భవిష్యత్తులో జరిగే ఏదైనా రష్యన్ దురాక్రమణను అడ్డుకోవడానికి ఈ దళాలకు సహాయం చేయడం కూటమి లక్ష్యంగా పేర్కొన్నారు.

Tags

Next Story