Volodymyr Zelensky: హాస్య నటుడి నుంచి అధ్యక్షుడిగా ఎదిగి.. రష్యాకి ఎదురునిలిచి..

Volodymyr Zelensky: కామెడీ నటుడిగా చిన్న చిన్న వేషాలు వేసి ప్రేక్షకులను నవ్విస్తున్నాడనుకున్నారు కానీ అతడే దేశాధ్యక్షుడై తమని పాలిస్తాడని కలలో కూడా ఊహించలేదు ఉక్రెయిన్ ప్రజలు. స్టార్ హీరోలు లేదా హీరోయిన్లు రాజకీయాల్లో రాణించిన సంఘటనలు మనకు తెలుసు. కామెడీ యాక్టర్లకు కూడా పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది.. కానీ చిన్న చిన్న పదవులతో సరిపెట్టుకుంటారు.. అధ్యక్షుడిగా ఎదిగి గుర్తింపు తెచ్చుకుంది మాత్రం వోలోడిమిర్ జెలెన్స్కీ. ఉక్రెయిన్ ప్రజల హృదయాలను గెలుచుకున్న జెలెన్క్సీ గురించిన విషయాలు..
జెలెన్క్సీ నటించిన కామెడీ షో సర్వెంట్ ఆఫ్ ది పీపుల్‌లో ఒక ఉపాధ్యాయుడి పాత్రను పోషించారు. అందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు అవుతాడు.. నిజ జీవితంలో అదే నిజమైంది.. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధ్యక్షుడిగా అతడికి పట్టం కట్టారు ఉక్రెయిన్ ప్రజలు.. వారి నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయలేదు జెలెన్క్సీ. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో సైన్యాన్ని ముందుండి నడిపిస్తున్నారు.. పారిపోవడం పిరికిపందల లక్షణం అని సైనికుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.. దేశం విడిచి పారిపోకుండా రష్యా దాడిని ఎదుర్కొంటున్న అధ్యక్షుడిగా నిలబడినందుకు ప్రశంసలు పొందారు.
కాబూల్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పుడు పారిపోయిన ఆఫ్ఘనిస్ట్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ మాదిరిగా, జెలెన్స్కీ కూడా దేశాన్ని ఖాళీ చేయమని యునైటెడ్ స్టేట్స్ చేసిన ప్రతిపాదనను తిరస్కరించాడు. " నాకు మందుగుండు సామగ్రి కావాలి, పారిపోను, ఫైట్ చేస్తాను అని అధ్యక్షుడు అన్నాడు.
జెలెన్స్కీ రష్యన్ మాట్లాడే యూదు వంశస్థుడు. లా చదువుకున్నా ఆ రంగంలో ఎప్పుడూ పని చేయలేదు. 2019 ఎలక్షన్స్‌లో ఒపీనియన్ పోల్‌లో ముందంజలో ఉన్నారు. 73% ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు, జెలెన్స్కీ ఒక నటుడు. హాస్య పాత్రలు పోషించి అభిమానులను సంపాదించుకున్నాడు. అతనికి ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. అధ్యక్షపదవి చేపట్టిన జెలెన్క్సీ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. పండోర పేపర్లలో ఆయన పేరు ఉంది. తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో, రష్యాతో వివాదాన్ని పరిష్కరిస్తానని జెలెన్స్కీ వాగ్దానం చేశారు. 2003లో ఒలెనాను వివాహం చేసుకున్న జెలెన్స్కీకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
సంక్షోభ సమయంలో జెలెన్స్కీ తరచుగా బహిరంగంగా కనిపిస్తూ ఉక్రెయిన్లకు ధైర్యం చెబుతున్నారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అతను ఉక్రేనియన్లను ఉద్దేశించి సోషల్ మీడియా ద్వారా ప్రసంగించారు. శనివారం, పేలుళ్ల శబ్దాల మధ్య సెల్ఫీదిగి వీడియోను విడుదల చేశారు. ఇది మన భూమి, మన దేశం, మన బిడ్డలు, వీటన్నింటిని కాపాడుకుంటాం. త్వరలోనే ఇది సాధ్యం అని ఆయన అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com