Russia-Ukraine: రష్యాకు ట్రంప్ వార్నింగ్..

Russia-Ukraine: రష్యాకు ట్రంప్ వార్నింగ్..
X
భవిష్యత్తులో మాస్కో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరిక..

గత కొన్నేళ్లుగా రష్యా – యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, యుక్రెయిన్ లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా మంత్రులు, అధికారుల బృందం, యుక్రెయిన్ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగాయి. ఇందులో అమెరికా ప్రతిపాదించిన 30రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి యుక్రెయిన్ అంగీకరించింది. ఈ మేరకు ఇరుపక్షాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.

30రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా మద్దతు ఇవ్వకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్సీ అమెరికా, యుక్రెయిన్ ప్రతినిధుల బృంధం చర్చల్లో కీలకంగా ప్రస్తావించారు. దీంతో అమెరికాసైతం దీనికి మద్దతు తెలిపింది. ఇదిలాఉంటే.. తాజా ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా వెళ్లాయి. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెల్లడించారు. అదే సమయంలో రష్యాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

‘‘మా ప్రతినిధులు రష్యాకు వెళ్లారు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారనే ఆశిస్తున్నాం. లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. కాల్పుల విరమణకు రష్యా అంగీకారం తెలపకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మాస్కో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అది రష్యాకే వినాశకరంగా మారుతుంది. అలాంటి ఫలితాన్ని నేను కోరుకోవటం లేదు. శఆంతిని సాధించడమే నా లక్ష్యం అని ట్రంప్ వివరించారు. ఒకవేళ రష్యా కాల్పుల విరమణకు ససేమీరా అంటే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ రష్యాకు వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలాఉంటే.. యుక్రెయిన్, రష్యా మధ్య 30రోజుల కాల్పుల విరమణకు యుక్రెయిన్ ఇప్పటికే అంగీకారం తెలపగా.. రష్యా ఏ విధంగా స్పందిస్తుంది.. అమెరికా ప్రతినిధుల బృందం ముందు రష్యా ఎలాంటి ప్రతిపాదనలు పెట్టబోతుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే, కాల్పుల విరమణపై చర్చ జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు. పశ్చిమ రష్యాలోని కర్క్స్ లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ ప్రాంతంలో కొంత భూభాగాన్ని యుక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags

Next Story