UNICEF: గాజా.. చిన్నారుల శ్మశాన వాటిక

UNICEF: గాజా.. చిన్నారుల శ్మశాన వాటిక
యుద్ధంలో అభంశుభం తెలియని చిన్నారుల బలి

ఇజ్రాయెల్‌-హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ మధ్య జరుగుతున్న యుద్ధంతో గాజా చిన్నారుల శ్మశాన వాటికగా మారిందని ఐరాస్ చీఫ్ ఆంటోనియో గుటెరస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణం ఇరు వర్గాలు కాల్పుల విరమణను ప్రకటించాలని కోరారు.ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య పోరుతో గాజా పిల్లల శ్మశానవాటికగా మారుతోందని ఐరాస చీఫ్ అంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. నెల నుంచి ఇరు వర్గాల మధ్య సాగుతున్న యుద్ధంలో చిన్నారులే అధికంగా మరణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం కాల్పుల విరమణకు ఆదేశించాలని ఇజ్రాయెల్‌ను కోరారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన మెరుపు దాడులలో పిల్లలు కూడా అధిక సంఖ్యలో మరణించారు. అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో చిన్నారుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. అందుకు గాజా ఆరోగ్యశాఖ వెల్లడిస్తున్న గణాంకాలే నిదర్శనం. ఇజ్రాయెల్‌ దాడుల్లో 10 వేల మందికిపైగా పాలస్తానియన్లు మృతి చెందగా అందులో 4 వేల మంది పిల్లలే ఉన్నారని ఐరాస తెలిపింది.

బాంబులు, మోర్టార్లకంటే ఎక్కువగా గాయాలతో, మంచి నీళ్ల కోసమే చిన్నారులు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. గాజాలో 10లక్షల కంటే ఎక్కువ మంది చిన్నారులు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. గుక్కెడు నీటి కోసం చంటిపిల్లల ఆరాటం పెను ముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు మరణించిన వారిలో 70శాతం మంది చిన్నారులు, మహిళలే ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా.. ఓవైపు గాయాలు, మరోవైపు మానసిక భయాలు చిన్నారులను వెంటాడుతున్నాయని తెలిపింది యూనిసెఫ్‌.


హమాస్‌ మిలిటెంట్ల సొరంగాలు జనావాసాల మధ్య ఉండటంతో ఇజ్రాయెల్ వాటిపైనే వైమానిక దాడులు చేస్తోంది. ఫలితంగా అనేక భవనాలు నేలమట్టమవుతున్నాయి. అలా కూలిన భవనాల్లో ఎక్కడా చూసిన పిల్లల మృతదేహాలే కనిపిస్తున్నాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నా ఔషధాల కొరత, విద్యుత్‌ సరఫరా లేక సరైన చికిత్స లభించడం లేదు. శరణార్థి శిబిరాల సమీపంలో కూడా ఇజ్రాయెల్ దాడుల చేస్తుండటంతో అక్కడా చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. మంగళవారం దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులో కూడా ఐదుగురు మరణించగా అందులో ముగ్గురు పిల్లలే ఉండటం అక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. గాయపడిన చిన్నారుల ఆర్తనాదాలు అక్కడి ఉన్న వారి హృదయాలను కలచి వేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story