UN Report : ప్రతి 4.4 సెకన్లకు ఓ శిశువు మరణం.. కలవర పెడుతున్న నివేదిక

శిశు మరణాలపై 2021కి గానూ... ఐక్యారాజ్యసమితి విడుదల చేసిన నివేదిక చేదు నిజాల్ని వెళ్లగక్కింది. ప్రతి 4.4 సెకన్లకు ఓ శిశువు మరణిస్తోందని వెల్లడించింది. ఇందులో నవజాత శిశువుల దగ్గర నుంచి యుక్తవయసు వారి వరకూ ఉన్నారని UN రిపోర్టు పేర్కొంది.
ఐదు మిలియన్ల కంటే ఎక్కువ మంది ఐదేళ్ల లోపు చిన్నారులు కాగా, అందులో 2.3 మిలియన్ల నవజాత శిశువులే ఉన్నారని నివేదిక చెబుతోంది. 5 నుంచి 24 ఏళ్ల లోపువారు 43 శాతం మంది మరణించినట్లు UN ఇంటర్ ఏజెన్సీ విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోతున్నారని, అందులోనూ పుట్లిన కాసేపటికే పసిగుడ్డులు ప్రాణాలు విడుస్తున్నారని యూనిసెఫ్ డేటా అనాలటిక్స్ డైరెక్టర్ విద్యాగణేష్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ మరణాలను నివారించగలమని, ప్రతి స్త్రీ కి ప్రతి బిడ్డకు సమానమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కల్పించగలిగితే అనుకూల ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇలా చేయడం ద్వారా 2000 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారి మరణాల సంఖ్య తగ్గిందని చెప్పారు. 2000 సంవత్సరం ప్రారంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాల రేటు సగానికి పడిపోయింది, అయితే పెద్ద పిల్లలు, యువతలో మరణాల రేట్లు 36 శాతం తగ్గాయి.
అలాగే శిశు మరణాల రేటు 35 శాతం తగ్గింది. మహిళలు, పిల్లలు,యువకులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో మరిన్ని పెట్టుబడులు పెడితేనే మంచి లక్ష్యాలను చేరుకోవచ్చని విద్యా పేర్కొన్నారు. ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి వేగంగా చర్యలు తీసుకోకపోతే 2030 లోపే దాదాపు 59 మిలియన్ల మంది పిల్లలు, యువత అలాగే 16 మిలియన్ల శిశు మరణాలు నమోయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com