జలాంతర్గామి గాలింపులో కీలక ముందడుగు
టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్ మినీ జలాంతర్గామి గాలింపులో కీలక ముందడుగు పడింది. కెనడాకు చెందిన పీ-8 నిఘా విమానం.. నీటి అడుగున శబ్దాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్‌లోని నార్త్‌ఈస్ట్ కమాండ్ పేర్కొంది. మరోవైపు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ మెమోను ఉటంకిస్తూ కెనడా విమానం సముద్రంలో శబ్దాలను గుర్తించిందని రోలింగ్ స్టోన్ నివేదిక వెల్లడించింది. దాదాపు ప్రతి 30 నిమిషాలకు ఈ చప్పుళ్లు వస్తున్నట్లు కెనడా విమానం గుర్తించిందని వెల్లడించాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఈ శబ్దాలను గుర్తించినట్లు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. మూడు రోజులుగా సాగుతున్న గాలింపు చర్యల్లో ఇదే తొలి పురోగతి. అమెరికా తన గాలింపు బృందాలు, అదనపు నౌకలు, పరికరాలను ఆ ప్రదేశానికి తరలిస్తోంది. గల్లంతైన జలాంతర్గామిలో బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త, సాహసయాత్రికుడు హమీష్ హార్డింగ్, పాకిస్థాన్ బిలియనీర్ షాజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, మరో ఇద్దరు ఉన్నారు. దీనిలో సుమారు మరో 30 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com