Smart Phone: పాఠశాలల్లోకి ఫోన్లా... చైనాను చూసి నేర్చుకోండి

Smart Phone: పాఠశాలల్లోకి ఫోన్లా... చైనాను చూసి నేర్చుకోండి
విద్యార్థుల స్మార్ట్‌ఫోన్లు వినియోగంపై నిషేధం ఉండాలన్న యునెస్కో

సైబర్ నేరాల ముప్పు నుంచి విద్యార్థులను తప్పించేందుకు పాఠశాలల్లో ఫోన్లను నిషేధించాలని ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో సూచించింది. విద్యార్థులను రక్షించుకునేందుకు ఇదే సరైన మార్గమని ప్రత్యేకంగా ఓ నివేదిక విడుదల చేసింది. టెక్నాలజీతో జాగ్రత్త ఉండాలని లేకపోతే పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తూ యునెస్కో ఈ నివేదికను విడుదల చేసింది.

ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. అధిక స్థాయి స్క్రీన్ సమయం పిల్లల భావోద్వేగాలపై ప్రభావం పడుతోందని వీటికి శాస్త్రీయ రుజువులు ఉన్నాయని తన నివేదికలో యునెస్కో పొందుపరిచింది.

ఎక్కువ సమయం మొబైల్స్ వాడడం వల్ల విద్యార్థుల చదువులు దారి తప్పుతున్నాయని వివరించింది. భావోద్వేగాలు అదుపు చేసుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ టెక్నాలజీపై వాళ్లకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పైనా చర్చించాలని సూచించింది. విద్యావ్యవస్థలో టెక్నాలజీ అమలు చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విద్యార్థులు నేర్చుకునే విధానంలో మార్పు మంచిదే అయినా...అది పరిధులు దాటితే ప్రమాదమని తేల్చి చెప్పింది. టెక్నాలజీ ఉంటేనే అది అభివృద్ధి అన్న సూత్రం అన్ని చోట్లా వర్తించదని స్పష్టం చేసింది.


డిజిటల్‌ విప్లవం శక్తివంతమైందే కావొచ్చని. కానీ, ముఖాముఖి బోధన అనేది పిల్లలకు చాలా అవసరమని, ఆ అవసరాన్ని స్మార్ట్‌ఫోన్‌.. డిజిటల్‌ టెక్నాలజీ.. చివరకు ఏఐ సాంకేతికత ఎప్పటికీ భర్తీ చేయలేవని ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అని యునెస్కో సూచించింది. సామాజిక పరిస్థితులకు అనుగుణంగానే విద్యావ్యవస్థ ఉండాలని, అన్ని విద్యా సంస్థలు దీనిపైనే దృష్టి పెట్టాలని యునెస్కో సూచించింది. టీచర్‌లు ముఖాముఖి విద్యార్థులతో మాట్లాడాలని, ఆన్‌లైన్‌లోనూ అన్నీ నేర్చుకునే వెసులుబాటు వచ్చినా, అది విద్యావ్యవస్థ మూలాల్ని చెరిపేసే విధంగా ఉండకూడదని సూచించింది.

సంప్రదాయ బోధనపైనా శ్రద్ధ పెట్టాలి. టెక్నాలజీ ఏదైనా సరే..అది చివరికి ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆలోచనా పరిధిని పెంచేదే అయి ఉండాలని. వన్ టు వన్ ఇంటరాక్షన్ అనేది చాలా కీలకమని నివేదిక తేల్చి చెప్పింది.

విద్యాసంస్థల్లో సాంకేతికత వినియోగంపై చైనాను చూసి నేర్చుకోవాలని ప్రపంచానికి యునెస్కో సూచించింది. డిజిటల్ పరికరాలను బోధనా సాధనాలుగా ఉపయోగించడానికి చైనా సరిహద్దులను నిర్దేశించింది. మొత్తం బోధనా సమయంలో 30 శాతానికి పరిమితం చేసిందని తెలిపింది. కరోనా టైంలో మాత్రమే చైనా ఆన్‌లైన్‌ విద్యను ప్రొత్సహించిందని.. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక తిరిగి విద్యాసంస్థలకే రప్పించుకుంటుంజని యునెస్కో ప్రత్యేకంగా ప్రస్తావించింది.

Tags

Read MoreRead Less
Next Story