US-Ukraine: రష్యాకు బిగ్ షాకిచ్చిన జో బైడెన్..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న నేపథ్యంలో యుక్రెయిన్ కు భారీ మిలిటరీ సాయంను అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ సోమవారం యుక్రెయిన్ కోసం కొత్తగా రూ. 6వేల కోట్ల మిలిటరీ ప్యాకేజీని ప్రకటించింది. ల్యాండ్ మైన్లు, యాంటీ ఎయిర్, యాంటీ ఆర్మర్ వెపర్లను యుక్రెయిన్ కు అగ్రరాజ్యం అందించనుంది. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చేనెల 20వ తేదీన అమెరికా అధ్యక్ష బాధ్యతలను ట్రంప్ చేపట్టనున్నారు. అయితే, భవిష్యత్తులో యుక్రెయిన్ కు ఇలాంటి సహాయం అందకపోవచ్చుననే ఆలోచనతో జో బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తీసుకుంది.
అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. రష్యా ఆక్రమణను ఆడ్డుకొని, యుక్రెయిన్ తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేలా ప్యాకేజీని అందజేస్తున్నామని చెప్పారు. ఇదిలాఉంటే.. ఫిబ్రవరి 2022లో రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి రష్యా సైనిక దళాలు యుక్రెయిన్ రాజధాని, ఇతర నగరాలపై బాంబుల దాడితో విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో ఆయా నగరాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. రష్యా దాడులను అడ్డుకునేందుకు యుక్రెయిన్ కు అమెరికా మద్దతుగా నిలిచింది. 60 బిలియన్ డాలర్లకు పైగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర భద్రతా సహాయాన్ని యుక్రెయిన్ కు అందించింది. తాజాగా జో బైడెన్ ప్రభుత్వం యుక్రెయిన్ కు మరోసారి భారీ మిలిటరీ సాయం అందించేందుకు సిద్ధమైంది.
కొద్దిరోజుల క్రితం యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. ‘‘యుద్ధంలోని కీలక దశను ఆపాలనుకుంటే మా నియంత్రణలో ఉన్న యుక్రెయిన్ భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలని అన్నారు. అప్పుడే మేం కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ తరువాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం మా దేశాన్ని (రష్యా ఆక్రమిత ప్రాంతాలతో కలిపి) నాటోలో చేర్చుకోవాలి. అలా జరిగితే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని దౌత్యపరంగా సాధించుకునే వీలు మాకు లభిస్తుందని జెలెన్ స్కీ అన్నారు. ఇదిలాఉంటే.. యుక్రెయిన్ కు భారీ మిలిటరీ సాయం అందించడంపై రష్యా తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com