Jaahnavi Kandula: జాహ్నవికి మరణానంతరం డిగ్రీ

Jaahnavi Kandula:  జాహ్నవికి మరణానంతరం డిగ్రీ
ఘటనపై న్యాయ విచారణ జరుపుతామన్న అమెరికా

అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి ప్రకంపనలు రేపుతోంది. అమెరికా సియాటెల్‌ పోలీసు అధికారి చులకన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని. అమెరికాను డిమాండ్‌ చేసింది. అగ్రరాజ్య శాసనకర్తలు, పలు రంగాల ప్రముఖులు, మంత్రులు కూడా పోలీసు అధికారి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వత్రా విమర్శల జడివాన కురుస్తున్న వేళ దీనిపై న్యాయ విచారణ జరుపుతామని అమెరికా వెల్లడించింది. మరోవైపు జాహ్నవి కుటుంబానికి తమ సంతాపం తెలియజేసిన యూనివర్సిటీ.. యువతికి మరణానంతర డిగ్రీ ప్రదానం చేసేందుకు ముందుకొచ్చింది. జాహ్నవి డిగ్రీ పట్టాను ఆమె కుటుంబానికి అందజేస్తామని వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి చెందిన ఘటనలో... సియాటిల్ పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన వీడియోపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలపై వెంటనే దర్యాప్తు జరపాలని అమెరికాను కోరింది. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం ట్వీట్ చేసింది. మృతి కేసు విచారణలో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన కథనాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని, సియాటిల్‌ అలాగే వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని భారత రాయభార కార్యాలయం పోస్ట్‌ చేసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశామని అలాగే సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వివరించింది.


జాహ్నవి కందుల మరణం పోలీసు అధికారి చులకన వ్యాఖ్యలపై అమెరికా చట్ట సభ్యులు సహా ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాహ్నవిని పోలీసు వాహనం ఢీకొని మరణించడం తనను కలచి వేసిందని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా, మరో కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమీలా జయపాల్ లు పేర్కొన్నారు. మరోవైపు జాహ్నవి కుటుంబానికి సియాటిల్ సిటీ మేయర్ బ్రూస్ హారెల్ లేఖ రాశారు. ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు సియాటెల్‌ నగర ప్రజల భావాలను ప్రతిబింబించవని లేఖలో హారెల్‌ పేర్కొన్నారు. జాహ్నవి మరణం తమను కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాహ్నవి కందుల మరణాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామని అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు స్పష్టం చేశారు.

అన్ని వైపుల నుంచి విమర్శల జడివాన కురుస్తుండడంతో అమెరికా స్పందించింది. తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతిపై త్వరితగతిన న్యాయబద్ధమైన దర్యాప్తు చేస్తామని అమెరికా ప్రభుత్వం భారత్‌కు హామీ ఇచ్చింది. కర్నూలు జిల్లా ఆదోని MIG కాలనీకి చెందిన 23 ఏళ్ల జాహ్నవి జనవరి 23న కళాశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోలీసు అధికారి డేనియల్ అడెరెర్‌ ఈ ఘటనకు సంబంధించి మాట్లాడిన మాటలు బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఘటన గురించి సహచరుడికి వివరిస్తూ జోకులు వేసుకుంటూ, నవ్వుతూ మాట్లాడారు. ఆమె ఒక సాధారణ వ్యక్తి అని, 11 వేల డాలర్ల చెక్‌ రాస్తే చాలని హేళనగా మాట్లాడాడు.


Tags

Read MoreRead Less
Next Story