US-Venezuela: కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా దాడి..

US-Venezuela: కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా దాడి..
X
11 మంది మృతి చెందినట్లు ట్రంప్ వెల్లడి

కరేబియన్ సముద్రంలో వెనిజులా మాదకద్రవ్య నౌకపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో 11 మంది మృతి చెందారు. అంతర్జాతీయ జలాల ద్వారా అమెరికా వైపు మాదకద్రవ్యాలను రవాణా చేస్తుండగా ఈ దాడి జరిగింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో సంబంధాలున్న నార్కో టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని ట్రంప్ అన్నారు. ట్రెన్ డి అరగువా కార్టెల్‌కు చెందిన 11 మంది అనుమానితులను చంపినట్లు మంగళవారం వెల్లడించారు. అమెరికా దళాలకు ఎటువంటి హాని జరగలేదని వెల్లడించారు. అమెరికాలోకి మాదకద్రవ్యాలను తరలించే వారందరికీ ఇదే హెచ్చరిక అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

TDA అని పిలువబడే ట్రెన్ డి అరగువాను విదేశీ ఉగ్రవాద సంస్థగా ట్రంప్ అభివర్ణించారు. ట్రెన్ డి అరగువా సంస్థ నికోలస్ మదురో నియంత్రణలో పనిచేస్తున్న విదేశీ ఉగ్రవాద సంస్థగా ట్రంప్ పేర్కొన్నారు. ఇది సామూహిక హత్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, లైంగిక అక్రమ రవాణా, యునైటెడ్ స్టేట్స్, పశ్చిమ అర్ధగోళంలో హింస, ఉగ్రవాద చర్యలకు బాధ్యత వహిస్తుందని ట్రంప్ వివరించారు.

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో స్పందిస్తూ.. తమ ప్రభుత్వంపై అమెరికా సైనిక చర్యను ముమ్మరం చేస్తోందని ఆరోపించారు. సైనిక బెదిరింపు ద్వారా పాలన మార్పును కోరుకుంటోందని మదురో వ్యాఖ్యానించారు. వెనిజులా సాయుధ దళాలు.. ఏదైనా ఘర్షణకు ప్రతిస్పందించడానికి సూపర్ సన్నద్ధంగా ఉందని చెప్పారు.

మదురో అరెస్టుపై అమెరికా 50 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. దీంతో ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కరేబియన్ దీవులు చాలా కాలంగా అమెరికా భద్రతా దళాలు-మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల మధ్య ఘర్షణలకు కేంద్రంగా మారింది. అమెరికా కోస్ట్ గార్డ్-చట్ట అమలు సంస్థలు.. రెండూ గతంలో వెనిజులా-పొరుగు దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్మగ్లర్లతో సముద్రంలో ఘోరమైన ఘర్షణలకు పాల్పడ్డాయి.

Tags

Next Story