US : ట్రంప్ ప్రభుత్వంపై దావా.. హెచ్-1బీ ఫీజు పెంపుపై కోర్టులో సవాల్

హెచ్-1బీ వీసా విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడాన్ని సవాల్ చేస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం వాషింగ్టన్‌లోని జిల్లా కోర్టులో ట్రంప్ ప్రభుత్వంపై దావా వేసింది.
ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ఫీజు పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇది అమలైతే అమెరికన్ కంపెనీలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన పిటిషన్‌లో పేర్కొంది. "ఈ నిర్ణయం వల్ల కంపెనీలు తమ కార్మిక వ్యయాలను విపరీతంగా పెంచుకోవాల్సి వస్తుంది. లేదంటే దేశీయంగా ప్రత్యామ్నాయం లేని అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడం తగ్గించుకోవాల్సి వస్తుంది" అని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అమెరికా ఆర్థిక ప్రత్యర్థులకు మేలు చేకూర్చే ప్రమాదకరమైన విధానమని అభిప్రాయపడింది.
ఈ ఫీజు వల్ల అమెరికా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకోవడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ బ్రాడ్లీ ఒక ప్రకటనలో తెలిపారు.
మరోవైపు ఈ నిర్ణయాన్ని ట్రంప్ ప్రభుత్వం గట్టిగా సమర్థిస్తోంది. అమెరికన్లకే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఫీజును తీసుకొచ్చినట్లు ట్రంప్ గతంలో తెలిపారు. ఈ విధానం వల్ల కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి వెనకాడుతాయని, బదులుగా అమెరికన్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకుంటాయని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వివరించారు.
కాగా, హెచ్-1బీ నిబంధనలపై ట్రంప్ సర్కారుకు ఇది రెండో పెద్ద న్యాయపరమైన సవాలు. ఈ నెల 3న కూడా కొన్ని యూనియన్లు, విద్యాసంస్థలు కలిసి కాలిఫోర్నియా కోర్టులో దావా వేశాయి. ఈ వివాదంపై గందరగోళం నెలకొనడంతో వైట్‌హౌస్ గతంలోనే స్పష్టతనిచ్చింది. ఈ లక్ష డాలర్ల ఫీజు కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్నవారిపై లేదా పునరుద్ధరణపై దీని ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. 2024 గణాంకాల ప్రకారం, మొత్తం హెచ్-1బీ వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులే పొందారు. ఈ నేపథ్యంలో కొత్త ఫీజు నిబంధన భారతీయ నిపుణులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com