Gurpatwant Singh: గురుపత్వంత్ హత్య కుట్ర కేసు..

Gurpatwant Singh: గురుపత్వంత్ హత్య కుట్ర కేసు..
భారత వ్యక్తిపై అమెరికా ఆరోపణలు.. భారత్ ఆందోళన

ఖలిస్తాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ను హత్య చేసేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగి కుట్ర పన్నాడని, హత్య చేసేందుకు ఈ ఏడాది మేలో అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారితో లక్ష డాలర్లు ఒప్పందం కూడా కుదిరిందని న్యూయార్క్‌ కోర్టులో ఆరోపణలు నమోదయ్యాయి. ఫెడరల్‌ ప్రాసిక్యూటర్స్‌ ఆరోపణల ఆధారంగా అమెరికా న్యాయ విభాగం భారత ప్రభుత్వ ఉద్యోగి నిఖిల్‌ గుప్తా (52)పై కేసు నమోదుచేసింది. ఈ నేరంలో దోషిగా తేలితే నిఖిల్‌ గుప్తాకు 10 ఏండ్ల జైలు శిక్ష విధిస్తామని న్యూయార్క్‌ జిల్లా యూఎస్‌ అటార్నీ మాథ్యూ జీ ఓల్సెన్‌ బుధవారం తెలిపారు. ఈ కేసులో నిందితుడు నిఖిల్‌ గుప్తాను చెక్‌ రిపబ్లిక్‌ అధికారులు 2023 జూన్‌ 30న అరెస్టు చేశారు.

అతడ్ని అమెరికాకు అప్పగించారా? లేదా? అన్నది తెలియరాలేదు. ఇదిలా ఉండగా, ఈ కేసు విచారణ నిమిత్తం ఇద్దరు అమెరికా నిఘా అధికారులు భారత్‌కు చేరుకున్నారు. దీంతో ఈ ఆరోపణల్లో నిజానిజాల్ని తేల్చేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు భారత్‌ ప్రకటించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మాట్లాడుతూ, ‘అమెరికాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ అంశంపై చర్చించాం. అన్ని కోణాల్లో పరిశీలించేందుకు నవంబర్‌ 18న ఉన్నతస్థాయి కమిటీని నియమించాం.

మరోవైపు.. యూఎస్‌లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో న్యూఢిల్లీపై తన అభియోగాన్ని పునరుద్ధరించారు. అమెరికా నుండి వస్తున్న వార్తలు.. తమ వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నాయన్నారు. భారతదేశం దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం తమతో కలిసి పని చేయాలని, తద్వారా విచారణ సాఫీగా సాగి అసలు నేరస్థుల్ని పట్టుకోవడానికి మార్గం సుగుమం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది ఎవరైనా తేలికగా తీసుకోవలసిన విషయం కాదని ట్రూడో పేర్కొన్నారు. అయితే.. భారత్ మాత్రం ట్రూడో ఆరోపణల్ని తిప్పికొట్టింది. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం లేదని ఖండిస్తోంది. ఈ కేసుకు సంబంధించి సరైన ఆధారాలు అందించేంతవరకూ తాము సహకరించేదే లేదని తేల్చి చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story