San Francisco: దాడి చేసిన వారిని వదిలి పెట్టబోమన్న అమెరికా

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై ఖలిస్థాన్ అనుకూల మద్దతుదారుల దాడిని ఆమెరికా తీవ్రంగా ఖండించింది. భారత రాయబార కార్యాలయానికి ఖలీస్థానీ మద్దతు దారులు నిప్పు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ట్వీట్ చేశారు. అమెరికాలో దౌత్య కార్యాలయాలు, రాయబారులపై దాడి చేయడం చట్టరిత్యా క్రిమినల్ నేరమని ఆయన గుర్తు చేశారు.ఖలిస్థాన్ రాడికల్స్ బృందం శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించిందని భారత రాయబార కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.
శాన్ ఫ్రాన్సిస్కో అగ్నిమాపక బృందం మంటలను త్వరగా అదుపులోకి తెచ్చిందని, ఈ దాడిని ఉగ్రవాద చర్య కంటే తక్కువేమీ కాదని వివరించారు. దాడిలో పెద్దగా నష్టం జరగలేదని, సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని ఆ అధికారి వెల్లడించారు. స్థానిక పోలీసులకు, ప్రత్యేక దౌత్య భద్రతా సిబ్బందికి, అమెరికా సమాఖ్య అధికారులకు భారత కాన్సులేట్ అధికారులు దాడి గురించి సమాచారం ఇచ్చారు. వెంటనే దాడిపై అగ్రరాజ్య అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత అధికారులతో పోలీసులు అనేకసార్లు సమావేశమై చర్చించారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత అధికారులు విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ టివి నాగేంద్ర ప్రసాద్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఖలీస్థానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించవద్దని అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల విజ్ఞప్తి చేశారు. తీవ్రవాద భావజాలాలు ఏ దేశానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. భారత రాయబార కార్యాలయం, శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ వెలుపల ఖలిస్తాన్ మద్దతుదారులు అనేకసార్లు నిరసనలు తెలిపినా...బెదిరించినా ఇప్పటివరకూ ఎవ్వరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని పలువురు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో ఖలిస్థాన్ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్టుకు భారత్‌లో ముమ్మర యత్నాలు చేస్తున్న సమయంలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయంపై ఇదేవిధంగా దాడి జరిగింది. రక్షణ బారికేడ్లును ధ్వంసం చేసుకుంటూ రాయబార కార్యాలయం ప్రాంగణంలోకి దూసుకొచ్చిన ఖలిస్థానీ మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. తలుపులు, కిటికిలపై రాడ్లతో దాడి చేశారు. ఖలిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ, ఖలిస్తాన్ జెండాలను ప్రాంగణంలో ఎగురవేశారు. దౌత్య కార్యాలయంపై దాడి విషయంలో దిల్లీలోని అమెరికా దౌత్యాధికారికి మన దేశం అప్పట్లో తీవ్ర నిరసన తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com