Indians ఈ సంవత్సరంలో మొత్తం 2,790 మంది భారతీయుల్ని వెళ్లగొట్టిన అమెరికా : కేంద్రం

అక్రమంగా నివసిస్తున్న వలసదారుల విషయంలో అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 2,790 మందికి పైగా భారతీయ పౌరులను బహిష్కరించినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అమెరికాలో నివసించేందుకు అవసరమైన అర్హతలు లేని వారిని గుర్తించి, ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి పంపిస్తున్నట్లు వెల్లడించింది.
విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వివరాలను వెల్లడించారు. "ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29 వరకు, అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 2,790 మందికి పైగా భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. వారి జాతీయతను, గుర్తింపును మేం ధ్రువీకరించిన తర్వాతే వారిని అమెరికా నుంచి వెనక్కి పంపారు" అని ఆయన వివరించారు. భారత్-అమెరికా మధ్య ఉన్న చట్టపరమైన, దౌత్యపరమైన విధానాలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాతో పాటు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) నుంచి కూడా భారతీయులను బహిష్కరించినట్లు జైస్వాల్ తెలిపారు. "ఈ ఏడాది యూకే నుంచి సుమారు 100 మంది భారతీయ పౌరులను బహిష్కరించారు. వారి జాతీయతను ధ్రువీకరించిన తర్వాతే యూకే ఈ చర్య తీసుకుంది" అని ఆయన పేర్కొన్నారు.
ఒకవైపు బహిష్కరణలు కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డేటా ప్రకారం, అక్టోబర్ 2024 - సెప్టెంబర్ 2025 మధ్య 34,146 మంది భారతీయులను సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 90,415గా ఉండగా, ఈసారి 62 శాతం క్షీణత నమోదైంది. ఇది గత నాలుగేళ్లలో అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం.
అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారిని గుర్తించి స్వదేశాలకు పంపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

