అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఈసారి రికార్డు స్థాయిలో ఎర్లీ ఓటింగ్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఈసారి రికార్డు స్థాయిలో ఎర్లీ ఓటింగ్‌

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు నవంబర్ 3వ తేదీన ఓటింగ్ జరగనుంది. ఆ రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసేకంటే ముందుగానే ఈ-మెయిల్ ద్వారా ఓటు వేసేవారి సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఎలక్షన్‌రోజు బూత్‌ ముందు క్యూకట్టేకంటే ఇప్పుడే ఓటు వేయడం మంచిదనే భావనతో చాలా మంది ఆన్‌లైన్‌లో, బ్యాలెట్ ద్వారా కూడా ఓట్ వేస్తున్నారు. ఇప్పటికి 60 మిలియన్ల మంది అంటే 6 కోట్ల మంది ఓటు వేశారు. ఈ స్థాయిలో ముందస్తు ఓట్లు పోలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇది రిపబ్లికన్లు, డెమోక్రాట్లలో ఎవరికి లాభం చేస్తుందనే దానిపై ఎవరి వాదనలు వాళ్లకున్నాయి.

అమెరికాలో 17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లలో ఇప్పటికే 6 కోట్ల మంది ఓటు వేశారు. ముందస్తు ఓటింగ్‌ టెక్సాస్‌లో ఎక్కువగా జరిగింది. అక్కడ దాదాపు 80 శాతం ఓట్లు పోలవడం విశేషం. ఈ-మెయిల్ ద్వారానే కాకుండా కొందరు బ్యాలెట్ ద్వారా కూడా ఇప్పుడే ఓటు వేసేస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 13 కోట్ల 70 లక్షల మంది ముందుగానే ఓటు వేయగా ఈసారి ఇది 15 కోట్లను దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. అటు, ఓ పక్క ఓటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే పలు సర్వేలు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈమెయిల్‌ ద్వారా కానీ, బ్యాలెట్ ద్వారా కానీ ఓటు వేసిన వారిలో 63 శాతం మంది బైడెన్‌కు జైకొట్టినట్టు తెలుస్తోంది.

ఈసారి ముందస్తు ఓటింగ్ పెరగడానికి కరోనా వైరస్ భయమూ ఒక కారణం అయ్యింది. పోలిగ్ రోజు క్యూలైన్లలో వేచి ఉండి వెళ్లేకంటే సమయం చూసుకుని ఇప్పుడే ఓటు వేయడం మంచిదని భావించే అంతా ఎర్లీ ఓట్‌ వైపు వెళ్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన ఇండిపెండెంట్‌ US ఎలక్షన్ ప్రాజెక్ట్‌ టాలీ ప్రకారం చూస్తే.. డెమోక్రాట్లు ఎర్లీ ఓట్‌ను బాగా ప్రోత్సహిస్తున్నారు. అటు, బ్యాలెట్‌ పత్రంలో ఈసారి మన తెలుగు భాషకు కూడా చోటు దక్కింది. అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరపున ప్రచారంలో తెలుగువారు కూడా కీలకపాత్ర పోషిస్తుండడం, బ్యాలెట్‌లోనూ తెలుగును ముద్రించడం లాంటివి ఈసారి ప్రత్యేకతగా చెప్పొచ్చు. గతంలో పోలిస్తే ఈసారి 3-4 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story