అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎదురీతకు కారణాలు ఇవేనా?

డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. దీనికి బోలేడు కారణాలున్నాయి. ఇవన్నీ ఆయన స్వయంకృతాలే. నోటి దురుసుతనం, మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యలు, గొప్పలు చెప్పుకోవడం, కరోనాపై నిర్లక్ష్యం, ప్రశ్నిస్తే హేళన చేయటం, సెక్స్ స్కాండల్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది కరోనాను నియంత్రించకపోవడం. ఈ మహమ్మారిని అడ్డుకోవడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు. ట్రంప్ వైఖరి వల్ల దాదాపు 2.3 లక్షల మంది ప్రజలు చనిపోయారు. కొన్ని ఆఫ్రికా దేశాలు సైతం కరోనాను నియంత్రణ చేయగలిగాయి. కానీ ట్రంప్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి... లక్షల మంది చావుకు కారణమయ్యారు. దీంతో జనం ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంతో ఉన్నారు. ఈ ప్రజాగ్రహాన్ని గ్రహించిన బైడెన్.. ట్రంప్ ఓటమితోనే కరోనా కట్టడి మొదలవుతుందంటూ పిలుపునిచ్చి ఓట్లు కొల్లగొట్టారు.
ఇక మరో అంశం మహిళలపై దిగజారి వ్యాఖ్యలు చేయడం. ట్రంప్ తమను లైంగికంగా వేధించాడంటూ 22 మంది మహిళలు ఆరోపించారు. ఇవన్నీ ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. ప్రత్యర్థిపార్టీ నేతలపైనే కాదు..తన తోటి రిపబ్లికన్ మహిళా నేతలపైనా, ఆఖరికి సొంతకూతురిపైనా అసహ్యంగా మాట్లాడారు. తన కుమార్తె ఇవాంకా చాలా మంచి సౌష్ఠవం ఉందని, ఆమె తన కూతురు కాకపోయి ఉంటే ఆమెతో డేటింగ్ చేసేవాణ్నంటు వ్యాఖ్యానించడం అసహ్యాన్ని పెంచింది. అలాగే.. ఒక మహిళా జర్నలిస్టును ఉద్దేశించి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన సమాధానాలతో ఆమె కళ్లతో పాటు ఎక్కడెక్కడి నుంచో రక్తం కారిందంటూ హేయమైన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ అమెరికన్లలోని ఒక వర్గంలో ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి.
అయితే ఇన్ని అవలక్షణాలు ఉన్న ట్రంప్.. చివరి వరకు జో బైడెన్‌తో పోటాపోటీగా నిలవడం ఆశ్చర్య పరిచింది. దీనికి కారణాలున్నాయి. అందులో ఒకటి జాతీయవాద వైఖరి. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ 2016లో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. వలస నిబంధనలను కఠినతరం చేశారు. ఉద్యోగాలను భారతీయులు, చైనీయులు కొల్లగొడుతున్నారన్న అసంతృప్తిలో ఉన్న చాలా మంది అమెరికన్లను ట్రంప్ ధోరణి ఆకర్షించింది. ఇక రెండోది పన్ను రేట్లను తగ్గించారు. పేదరికాన్ని, నిరుద్యోగితను సైతం తగ్గించగలిగారు. గత 50 ఏళ్లల్లోనే అతి తక్కువ నిరుద్యోగిత ట్రంప్ హయంలోనే నమోదైంది. ఇవన్నీ సగటు శ్వేతజాతివారిని బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ట్రంప్‌కు 2016 ఎన్నికల కంటే 40 లక్షల ఓట్లు ఎక్కువగా పడ్డాయి. ఇన్నీ కారణాలతో జో బైడెన్‌కు గట్టిపోటీ ఇచ్చిన ట్రంప్.. చివరికి తన స్వయంకృతాలతోనే అధ్యక్ష ఎన్నికల్లో ఎదురీదుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com