అమెరికా అధ్యక్ష ఫలితంపై ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ

అమెరికా అధ్యక్ష ఫలితంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గత నాలుగు రోజులుగా ఓట్ల లెక్కింపు జరుగుతున్నా... ఇంకా తుది ఫలితం మాత్రం తేలడం లేదు. ప్రస్తుతం బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. మ్యాజిక్ ఫిగర్‌కు మరో 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో ఉన్నారు. 214 ఓట్లతో ట్రంప్ చాలా దూరంలో నిలిచిపోయారు. లెక్కింపు జరుగుతున్న ఐదు రాష్ట్రాలే అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించబోతున్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో.. మూడు చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు బైడెన్. అయితే అతి స్వల్ప తేడాతోనే ట్రంప్ కంటే ఆయన ముందున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఫలితాలను చూస్తే బైడెన్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆయన మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు.
అమెరికా ఫలితాలను ఓసారి చూస్తే... నెవడలో మొత్తం 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ బైడెన్ ముందంజలో ఉన్నారు. బైడెన్‌కు 49.8 శాతం ఓట్లు రాగా.. ట్రంప్‌కు 48 శాతం ఓట్లు వచ్చాయి. ట్రంప్ కంటే 22 వేల 4 వందల ఓట్ల ఆధిక్యం కొనసాగుతున్నారు జో బైడెన్. ఇంకా 13 శాతం ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇక్కడ తుది ఫలితం వచ్చేందుకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
ఇక జార్జియాలో49.4 శాతం ఓట్లు బైడెన్‌కు పడగా.. ట్రంప్‌కు 49.3 శాతం వచ్చాయి. ఇక్కడ కూడా ఇద్దరి మధ్య స్వల్ప తేడానే. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో 4 వేల ఓట్లతో బైడెన్ లీడ్‌లో ఉన్నారు. ఓట్ల లెక్కింపు వివాదం నేపథ్యంలో మరోసారి కౌంటింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు జార్జియా మేయర్.
ప్రస్తుతం లెక్కింపు జరగాల్సిన పెన్సిల్వేనియా రాష్ట్రంలో 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ముందుగా ఇక్కడ ట్రంప్ లీడ్‌లో ఉండగా.. అనూహ్యంగా బైడెన్ లీడ్‌లోకి దూసుకొచ్చారు. దీంతో ట్రంప్‌కు దారులు మూసుకుపోయాయి. కౌటింగ్‌లో ఇద్దరి మధ్య హోరా హోరి పోరు నడుస్తోంది. ఇప్పటి వరకు బైడెన్ 49.6 శాతం ఓట్లు దక్కించుకోగా.. ట్రంప్ 49.2 శాతం ఓట్లతో వెనకబడ్డారు. పెన్సిల్వేనియాలో 29 వేల ఓట్ల ఆధిక్యంలో బైడెన్ కొనసాగుతున్నారు. ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాల్లో గెలిస్తే.. ఏకంగా 3 వందలకుపైగా ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు బైడెన్.
కౌంటింగ్ నత్తనడకన సాగుతుండడంతో... తుది ఫలితాల వెల్లడికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నాలుగు రోజుల నుంచి ఫలితాలపై పూర్తి క్లారిటీ రాకపోవడం.. చాలాచోట్ల ఫలితాలు హోరాహోరీగా ఉండడంతో.. ఇటు ట్రంప్ మద్దతు దారులు.. అటు బైడెన్ మద్దతు దారులు రెచ్చిపోతున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఆందోళనలకు దిగారు. కొన్ని చోట్ల తీవ్ర ఘర్షణ వాతావరణ కనిపించింది. ప్రస్తుత పరిణామాలను అంచానా వేసిన అమెరికా నిఘా విభాగం అధికారుల బృందాలు.. జో బైడెన్‌కు రక్షణ కల్పించేందుకు విల్మింగ్టన్, డెలావర్‌కు తరలి వెళ్లినట్టు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వారికి అమెరికా సీక్రెట్ సర్వీస్ భారీగా భద్రత కల్పిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com