Indian Students: అమెరికాలో భారీగా తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య!

ఉన్నత విద్య కోసం అమెరికా విశ్వవిద్యాలయాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య బాగా తగ్గుతోంది. దీనికి కారణం విద్యార్థి వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన విధానాలే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని విద్యా సలహాదారులు అవుట్‌బౌండ్ ట్రాఫిక్ 70 శాతం తగ్గిందని గుర్తించారు. వీసా అపాయింట్‌మెంట్ స్లాట్‌లలో కొనసాగుతున్న ఫ్రీజ్, వీసా తిరస్కరణ రేట్లలో ఆకస్మిక పెరుగుదల కారణంగా ఈ తగ్గుదల ఏర్పడిందని తెలిపారు.
"సాధారణంగా ఈ సమయానికి, చాలా మంది విద్యార్థులు తమ వీసా ఇంటర్వ్యూలను పూర్తి చేసుకుని, విమాన ప్రయాణానికి సిద్ధమవుతుంటారు. ఈ ఏడాది మేము ఇప్పటికీ స్లాట్ తెరవబడుతుందని ఆశతో ప్రతిరోజూ పోర్టల్‌ను రిఫ్రెష్ చేస్తున్నాము. గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితి చూడలేదు" అని హైదరాబాద్ ఓవర్సీస్ కన్సల్టెంట్ నుంచి సంజీవ్ రాయ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు.
వీసా స్లాట్‌లను దశలవారీగా విడుదల చేస్తామని అమెరికా అధికారులు హామీ ఇచ్చారు. అయితే, ఈ విషయంలో ఇప్పటివరకు చాలా అస్పష్టత ఉంది. దీనివల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా, స్లాట్‌లను బుక్ చేసుకోగలిగిన విద్యార్థులు కన్ఫర్మేషన్ పొందలేకపోయారని విండో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి చెందిన అంకిత్ జైన్ అన్నారు. ఫలితంగా విద్యార్థులు విద్య కోసం ఇతర దేశాలను అన్వేషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
"నేను నిజంగా వేచి ఉండలేకపోయాను. ఇలా అయితే నేను ఒక ఏడాది కోల్పోతాను. ఈ సమయంలో ఇది ఒక ముగింపులా కనిపిస్తోంది. అందుకే నేను నా దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాను" అని 23 ఏళ్ల ఓ విద్యార్థి తెలిపాడు. తాను ఇప్పుడు ఆటోమోటివ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ కోసం జర్మనీని ఎంచుకున్నట్లు సదరు విద్యార్థి పేర్కొనడం జరిగింది.
కాగా, గతేడాది భారత్ 3.3 లక్షల మంది విద్యార్థులను అమెరికాకు పంపించి చైనాను అధిగమించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) డేటా ప్రకారం, 2024 జనవరి 1నాటికి 11.6 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్నారు. ఇదే సమయంలో యూరప్‌ను గమ్యస్థానంగా మార్చుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని విశ్లేషకులు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com