ఆపరేషన్ కంప్లీట్.. ఆఫ్గాన్ టు అమెరికా.. మళ్లీ తాలిబన్ల శకం..!

ఆఫ్గాన్ పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయింది అమెరికా. నిన్న అర్థరాత్రి మిగిలిన సైనికులు, పౌరులను తీసుకుని అమెరికా బయల్దేరింది. ఇవాళ్టితో అమెరికా విధించుకున్న డెడ్‌లైన్ ముగుస్తుండడంతో.. గడువుకు కాస్త ముందే ఆఫ్గాన్‌ను వీడి వెళ్లిపోయింది. పెంటగాన్ సైతం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఇవాళ్టి నుంచే ఆఫ్గాన్‌లో అరాచక రాజ్యస్థాపన జరగబోతోంది. ఈ క్షణం కోసమే కాచుకుని కూర్చున్న తాలిబన్లు.. అమెరికా చివరి విమానం సైతం వెళ్లిపోవడంతో పండగ చేసుకుంటున్నారు. గాల్లోకి కాల్పులు జరుపుతూ సంబరాలు చేసుకున్నారు.
నిజానికి ఇవాళ్టి సాయంత్రం లేదా రాత్రి వరకు అమెరికాకు టైం ఉంది. కాని, కాబూల్ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా దాడులకు దిగుతోంది ఐసిస్-కె. ఆత్మాహుతి దళాలను ఎయిర్‌పోర్టు వైపు పంపిస్తోంది. అంతటితో ఆగకుండా అమెరికా సేనలే టార్గెట్‌గా రాకెట్ దాడులు జరిపింది. ఈ దాడులను అమెరికా దళాలు సమర్ధంగా ఎదుర్కొన్నాయి. ఉన్నాకొద్దీ ముప్పు తప్పదని భావించిన అమెరికా సైన్యం.. కాస్త ముందుగానే ఆఫ్గాన్‌ను విడిచిపెట్టింది. నిన్ననే దాదాపుగా సిబ్బంది, ప్రజలను తరలించేసింది అమెరికా.
మొత్తానికి 20 ఏళ్ల క్రితం ఆఫ్గాన్ గడ్డపై అడుగుపెట్టిన అమెరికా.. ఇవాళ్టితో తన ఆపరేషన్‌ను ముగించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడిని సీరియస్‌గా తీసుకున్న అమెరికా.. ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చడమే లక్ష్యంగా ఆఫ్గాన్‌లో కాలుమోపింది. జార్జ్ బుష్ హయాంలో మొదలైన ఈ ఆపరేషన్.. ఒబామా, ట్రంప్, బైడెన్ ప్రభుత్వాల వరకు కొనసాగింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే బిన్ లాడెన్‌ను మట్టుబెట్టినప్పటికీ.. ఇవాళ్టి వరకు ఆ ఆపరేషన్‌ను కొనసాగించింది. ఇవాళ్టితో డెడ్‌లైన్ ముగుస్తుండడంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి లార్జ్ సి-17 విమానంలో మిగిలిన సైనికులు, పౌరులను తీసుకుని అమెరికా బయల్దేరినట్టు రక్షణ శాఖ కార్యాలయం తెలిపింది.
తాలిబన్లే లక్ష్యంగా ప్రారంభమైన యుద్ధం.. చివరికి వారి సహకారంతోనే ఆపరేషన్ ముగించుకుని ఇంటికి చేరుకుంది అమెరికా. తాలిబన్లు, అమెరికా దళాల మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నప్పటికీ.. ఆఫ్గాన్ నుంచి అమెరికా దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు చాలా సహకరించారని అమెరికా చెప్పుకొచ్చింది. మొత్తానికి అమెరికా దళాలు ఆఫ్గాన్‌ను పూర్తిగా ఖాళీ చేయడంతో తాలిబన్లు తుపాకులతో గాలిలో కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com