USA: పెరుగుతున్న కరోనా కేసులు..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కరోనావైరస్ బారినపడ్డారు. యూఎస్ ప్రథమ మహిళ తేలికపాటి లక్షణాలు ఎదుర్కొంటున్నారు . కాస్త అస్వస్థతకు గురైన ఆమెను వైద్యులు పరీక్షించగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు అమెరికా అధికారిక భవనం వైట్‌హౌస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. డెలావర్ లోని రెహోబోత్ బీచ్ ప్రాంతంలో ఉన్న నివాసంలో ఆమె ఉన్నారని వెల్లడించింది. ఏడాది క్రితం కూడా ఆమె కరోనా బారిన పడింది. అయితే, జో బైడెన్‍కు మాత్రం కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది.
జి 20 సదస్సులో పాల్గొనేందుకు ప్రెసిడెంట్ బిడెన్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ వారం బిడెన్‌ను క్రమం తప్పకుండా పరీక్షించి, లక్షణాల కోసం పర్యవేక్షిస్తానని పియరీ తెలిపారు. జో బిడెన్ సతీమణికి కొవిడ్ రెండో సారి సోకడం సంచలనం రేపింది. బిడెన్ భార్య 72 ఏళ్ల జిల్ బిడెన్ కు గత ఏడాది ఆగస్టు నెలలో కొవిడ్ వచ్చింది. ఇక 80 ఏళ్ల ప్రెసిడెంట్ బిడెన్ కు చివరిసారిగా 2022 జులై నెలలో పాజిటివ్ అని వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ.. గత కొద్ది నెలలుగా కోవిడ్ కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఐరోపాలోని కొన్ని దేశాలతోపాటు అమెరికాలోనూ కరోనా కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు సూచనలు చేస్తోంది.
కరోనా కొత్త వేరియంట్ పేరు BA.2.86, పిరోలా. ఇది ఒమైక్రాన్ వేరియంట్‌కి సబ్ వేరియంట్. ఒమిక్రాన్ వేరియంట్‌తో పోలిస్తే పిరోలాలో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని, అందువల్లే అది వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కొత్త మ్యుటేషన్ల కారణంగా మానవ రోగ నిరోధక వ్యవస్థ నుంచి సులభంగా తప్పించుకో గలుగుతున్నందున, ఇది తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి సోకే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాగా, పిరోలా 2023 మార్చిల్లో ఇజ్రాయెల్‌లో మొదటి సారి కనుగొన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ అమెరికా, బ్రిటన్, చైనా ఇజ్రాయెల్, కెనడా, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com