US: ఖురాన్ మీద ప్రమాణం చేసిన తొలి మేయర్

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగర 112వ మేయర్‌గా భారతీయ మూలాలున్న 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా న్యూయార్క్ ఓల్డ్ సిటీ హాల్ సబ్వే స్టేషన్ వద్ద నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. మమ్దానీ కుటుంబ సభ్యులు, సలహాదారులు, సన్నిహితులు హాజరయ్యారు. న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన తొలి దక్షిణాసియావాసిగా, తొలి ముస్లింగా, రెండో పిన్న వయస్కుడిగా మమ్దానీ రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. ఆయనతో స్టేట్ అటార్నీ జనరల్ లెటీటియా జేమ్స్ ప్రమాణం చేయించారు. మమ్దానీ రెండు ఖురాన్ ప్రతులపై ప్రమాణం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా భార్య రమా దువాజీ పక్కనే ఉన్నారు.
ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మహమూద్ మమ్దానీల కుమారుడైన జోహ్రాన్.. ఉగాండా రాజధాని కంపాలాలో జన్మించారు. ఏడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి అమెరికా చేరుకున్నారు. 2018లో అమెరికా పౌరసత్వం పొందారు. మేయర్‌గా న్యూయార్క్ నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని మమ్దానీ ప్రకటించారు. తన ప్రమాణ స్వీకారం నూతన అధ్యాయానికి ప్రారంభంగా అభివర్ణించారు. ప్రమాణ స్వీకారానికి వేదికగా పాత సబ్వే స్టేషన్‌ను ఎంచుకోవడానికి గల కారణాన్ని వివరించారు. ఇది 1904లో ప్రారంభమైందని, ఘన చరిత్ర కలిగి ఉందని పేర్కొన్నారు. ప్రజల జీవితాలను మార్చేలా తెలివైన, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ఇదొక ప్రతీక అని చెప్పారు. ప్రమాణం కోసం మమ్దానీ ఉపయోగించిన ఖురాన్ ప్రతులకు కూడా ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఇందులో ఒకటి మమ్దానీ తాత నుంచి వారసత్వంగా వచ్చింది. మరొకటి న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ నుంచి తీసుకొచ్చారు. దీనికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. నల్ల జాతీయుల సంస్కృతిపై స్కోమ్బర్గ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ క్రమంలోనే పలు ఖురాన్ ప్రతులను, పుస్తకాలను సేకరించింది. వీటిని న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీలో భద్రపరిచారు. అందులో ఒకటి మమ్దానీ ఉపయోగించిన ఖురాన్ కావడం విశేషం. తమ లైబ్రరీ నుంచి తీసుకెళ్లిన ఖురాన్‌పై మేయర్ ప్రమాణం చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నామని లైబ్రరీ సీఈఓ ఆంథోనీ డబ్ల్యూ మార్క్స్ చెప్పారు. ఖురాన్‌పై ప్రమాణం చేసిన తొలి న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మరో రికార్డు సృష్టించారు.
ఉమర్ ఖలీద్‌కి లేఖ
ఢిల్లీ అల్లర్ల కేసులో జైలులో మగ్గుతున్న ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ సంఘీభావం తెలిపారు. ఖలీద్ తల్లిదండ్రులను కలిసి, ఆయన రాసిన లేఖను స్వయంగా అందజేశారు. "ప్రియమైన ఉమర్, చేదు అనుభవాలు మనల్ని మింగేయకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో నువ్వు చెప్పిన మాటలు నాకు తరచూ గుర్తుకు వస్తుంటాయి. మీ తల్లిదండ్రులను కలవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాము," అంటూ మమ్దానీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులు సహిబా ఖానమ్, సయ్యద్ ఖాసిమ్ రసూల్ ఇలియాస్ తమ చిన్న కుమార్తె వివాహానికి ముందు అమెరికాలో ఉంటున్న మరో కుమార్తెను కలవడానికి వెళ్లారని ఉమర్ ఖలీద్ భాగస్వామి బనోజ్యోత్స్న లాహిరి తెలిపారు. ఆ సమయంలోనే వారు మేయర్ మమ్దానీని కలిసి కొంత సమయం గడిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

