Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రాణాంతక కేన్సర్ నిర్దారణ

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రొస్టేట్ కేన్సర్ నిర్దారణ అయినట్టు ఆయన కార్యాలయం ఆదివారం ప్రకటించింది. కేన్సర్ ఇప్పటికే ఎముకల వరకు విస్తరించినట్లు వెల్లడించింది. మూత్ర సంబంధిత సమస్యతో బాధపడుతోన్న బైడెన్‌కు వైద్య పరీక్షలు చేయడంతో ప్రొస్టేట్ గ్రంథిలో ట్యూమర్ గుర్తించినట్టు పేర్కొంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స కోసం కుటుంబసభ్యులు మార్గాలను పరిశీలిస్తున్నారని తెలిపింది. ‘ఇది తీవ్రమైన కేన్సర్ అయినప్పటికీ, హార్మోన్‌ల చికిత్స వల్ల తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అందువల్ల మాజీ అధ్యక్షుడు, ఆయన కుటుంబం వైద్యుల సూచనలతో చికిత్సా అవకాశాలను పరిశీలిస్తున్నారు’ అని ప్రకటనలో వివరించారు. అనారోగ్య కారణాలతోనే జో బైడెన్ గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్గ త వారం నుంచి మూత్ర సంబంధిత సమస్యలు ఎక్కువ కావడంతో పాటు, ప్రోస్టేట్ గ్రంథిలో ఒక కణితిని గుర్తించిన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల అనంతరం గత శుక్రవారం జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వ్యాధి తీవ్రతను సూచించే గ్లీసన్ స్కోర్ 9 (గ్రేడ్ గ్రూప్ 5) గా ఉందని, క్యాన్సర్ కణాలు ఎముకలకు కూడా విస్తరించాయని (మెటాస్టాసిస్) ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, ఈ క్యాన్సర్ హార్మోన్లకు స్పందించే తత్వం కలిగి ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమని, దీనివల్ల సమర్థవంతమైన చికిత్స అందించేందుకు వీలుంటుందని వైద్యులు భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు బైడెన్, ఆయన కుటుంబ సభ్యులు వైద్య నిపుణులతో కలిసి అందుబాటులో ఉన్న చికిత్సా మార్గాలపై సమీక్ష జరుపుతున్నారని కార్యాలయం వివరించింది.
బైడెన్ అనారోగ్య వార్త తెలియగానే రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు స్పందించారు. "జో బైడెన్ అనారోగ్య నిర్ధారణ గురించి విని నేను, మెలానియా విచారం వ్యక్తం చేస్తున్నాం. జిల్, కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. జో త్వరగా, విజయవంతంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం" అని ట్రూత్ సోషల్ మాధ్యమంలో ట్రంప్ పోస్ట్ చేశారు. బైడెన్ త్వరగా కోలుకోవాలని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆకాంక్షించారు.
బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన కమలా హ్యారిస్ కూడా స్పందిస్తూ "జో ఒక యోధుడు. ఈ సవాలును కూడా ఆయన ఎప్పటిలాగే ధైర్యంగా ఎదుర్కొంటారని నాకు తెలుసు" అని 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డెమోక్రటిక్ పార్టీ చట్టసభ సభ్యుడు రో ఖన్నా కూడా స్పందిస్తూ "ఇటీవల నిర్ధారణ అయిన క్యాన్సర్‌ను ఓడించడానికి జో బైడెన్, ఆయన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. ఆయన, జిల్ ఎప్పుడూ పోరాట యోధులే. ఈ సవాలును కూడా వారు ధైర్యంగా, హుందాగా ఎదుర్కొంటారని నాకు నమ్మకం ఉంది" అని 'ఎక్స్' లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com