US-Iran: పశ్చిమాసియాకు అమెరికా యుద్ధ విమానాలు..
ఓ వైపు అమెరికా- ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కానీ మరో వైపు టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున అమెరికా యుద్ధ విమానాలు మోహరిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 50 యుద్ధ విమానాలు, ఒక యుద్ధనౌకను పంపింది. డిపెండెంట్ ఫ్లైట్-ట్రాకింగ్ డేటా, మిలిటరీ ఏవియేషన్ మానిటర్ల ప్రకారం.. F-22, F-35, F-16 వంటి ఆధునిక యుద్ధ విమానాలు మధ్యప్రాచ్యం వైపు వెళుతున్నట్లు కనిపించాయి. వీటితో పాటు అనేక వైమానిక ఇంధనం నింపే ట్యాంకర్‌లు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే US సైన్యం సుదీర్ఘ సైనిక చర్యకు సిద్ధమవుతోందని సంకేతాలు వెలువడుతున్నాయి.
మంగళవారం స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా జరిగిన అణు చర్చలు విఫలమైనట్లుగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అణు చర్చల సందర్భంగా ఇరాన్ కీలక డిమాండ్లకు అంగీకరించలేదని.. చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని తెలిపారు. ప్రస్తుతానికి చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తొలి విడత చర్చలు ఒమన్ వేదికగా జరిగాయి. అక్కడ చర్చలు ఫలించకపోవడంతో రెండో విడత చర్చలు మంగళవారం జెనీవా వేదికగా జరిగాయి. ఇక్కడ కూడా చర్చలు ఫలించలేదు. చాలా తక్కువ సమయంలోనే చర్చలు ముగిసినట్లుగా తెలుస్తోంది. ఆశ్చర్యం ఏంటంటే.. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు ఇరాన్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా క్షిపణి ప్రయోగాలు చేసింది. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే రెండో విడత చర్చలు కూడా విఫలం కావడంతో భారీ యుద్ధ విమానాలు టెహ్రాన్ దిశగా వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దాదాపు అమెరికా-ఇరాన్ మధ్య 3 గంటల పాటే చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన డిమాండ్లను అంగీకరించడానికి టెహ్రాన్ ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. అలా చర్చలు జరుగుతున్న సమయంలోనే టెహ్రాన్ హార్ముజ్ జలసంధిలో అమెరికా సైనిక విన్యాసాలను ప్రారంభించింది.
చర్చల తర్వాత ట్రంప్ ప్రత్యేక రాయబారులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రతినిధులు రెండు వారాల్లోపు కొత్త ప్రతిపాదనలతో తిరిగి రావచ్చన్నారు. రెండు దేశాల మధ్య విభేదాలను తగ్గించే లక్ష్యంతో ఇవి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. ఈ చర్చలు నిర్మాణాత్మకమైనవి.. సానుకూలమైనవిగా అభివర్ణించారు. మునుపటి సమావేశం కంటే మెరుగైన పురోగతి సాధించామని చెప్పారు. ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్-బుసైది మాట్లాడుతూ.. చర్చలు సానుకూల వాతావరణంలో ముగిశాయన్నారు.
ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అతి పెద్ద నౌకతో పాటు మరిన్ని శక్తివంతమైన నౌకలు అరేబియా సముద్రంలో మోహరించాయి. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక శత్రువుల అంతు చూస్తోంది. ఇరాన్ సైన్యాన్ని ఒక దెబ్బకు నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ యుద్ధనౌకతో పాటు గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, జలాంతర్గాములు, ఇతర నౌకలతో స్ట్రైక్ గ్రూప్ ఉంటుంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకలో ప్రాణాంతక యుద్ధ విమానాలు ఉంటాయి. యుద్ధానికి దిగితే భూమి నుంచి.. సముద్రం నుంచి.. ఆకాశం నుంచి ఎక్కడి నుంచైనా శత్రువును దెబ్బకొట్టగల సామర్థ్యం ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


