Iran vs Israel war: ఇరాన్‌లో మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు

ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా విజయవంతంగా వైమానిక దాడులు నిర్వహించిందని మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. “ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్” అనే కీలక అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని శనివారం ఆయన “ట్రూత్ సోషల్” వేదికగా తెలిపారు. “ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై మేం చేసిన దాడి పూర్తి విజయవంతంగా ముగిసింది. మా బాంబర్లు ఫోర్డోపై పూర్తి స్థాయిలో పేలోడ్‌తో దాడి చేశాయి. ప్రస్తుతం మా విమానాలన్నీ ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చాయి. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నాయి. ఈ సాహసోపేత ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన మా వీర సైనికులకు హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి ఆపరేషన్‌ను ప్రపంచంలో మరే దేశ సైన్యం కూడా చేయలేదని గర్వంగా చెబుతున్నాను.
ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని నమ్ముతున్నాను,” అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయవంతమైన ఆపరేషన్ గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు శనివారం రాత్రి 10:00 గంటలకు వైట్‌హౌస్ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. “ఇది అమెరికా, ఇజ్రాయెల్ ప్రపంచానికి చారిత్రక ఘట్టం. ఇరాన్ ఇప్పుడు ఈ ఘర్షణకు ముగింపు పలకాలి. ధన్యవాదాలు!” అని మరో సందేశంలో ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే, గత వారం ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలు అణు కేంద్రాలు, సీనియర్ నేతలు లక్ష్యంగా మారిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అనేక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. డజన్ల కొద్దీ ఇరానియన్ సైనికులు, అణు శాస్త్రవేత్తలు మరణించారు. ప్రతిగా, ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిఘాతం తెలిపింది. ఈ ఉద్రిక్త వాతావరణంలో అమెరికా తాజా దాడులు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతేకాదు, ఇరాన్‌తో చర్చలు ప్రారంభించేందుకు గరిష్టంగా రెండు వారాల సమయం ఇస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com