H1B Visa: హెచ్-1బీ ప్రోగ్రామ్ రద్దుకు.. అమెరికా చట్టసభలో బిల్లు

అమెరికాలోని లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులను ఆందోళనకు గురిచేసే కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ చట్టసభలో కీలక బిల్లును ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్టూబ్ ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో ‘‘దోపిడీని దిగుమతి చేసుకున్న కార్మిక మినహాయింపుల చట్టం ముగింపు Ending Exploitative Imported Labor Exemptions Act’’ (EXILE) పేరుతో ఈ బిల్లును ఆయన ప్రతిపాదించారు. అగ్రరాజ్యం ఇమ్మిగ్రేషన్ చట్టాలను సవరించి.. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దుచేయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. . ఇదిలా ఉండగా, హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో కఠిన ఆంక్షలు ఉన్నా.. టెక్ దిగ్గజాలు మాత్రం ఏఐ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి.
సొంత పౌరుల సంక్షేమం కంటే విదేశీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం అమెరికా జాతి ప్రయోజనాలకు వ్యతిరేకమని గ్రెగ్ వాదిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు తక్కువ జీతాలకే విదేశీ కార్మికులను తెచ్చుకుంటూ మన యువతకు దక్కాల్సిన అవకాశాలను హరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికన్ల కోసం ‘అమెరికన్ డ్రీమ్’ సాకారం కావాలంటే ఈ దోపిడీని అరికట్టాలని, అందుకే ఈ బిల్లును తాను ప్రతిపాదిస్తున్నట్లు రిపబ్లికన్ నేత పేర్కొన్నారు. ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదం లభించి చట్టంగా మారితే లక్షల మంది భారత టెకీల అమెరికా డాలర్ డ్రీమ్ ఆశలపై నీళ్లు చల్లినట్లే.
కాగా, H-1B Visa పొందుతున్న విదేశీయుల్లో 80 శాతానికి పైగా భారత్, చైనా నిపుణులే ఉంటున్నారు. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం వీసా నిబంధనలను కఠినతరం చేసింది. వీసా పీజును లక్ష డాలర్లకు పెంచి షాక్ ఇచ్చింది. అలాగే, లాటరీ విధానానికి కూడా స్వస్థి చెప్పి, అధిక వేతనం ఇచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తక్కువ వేతం లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు వీసా జారీ ప్రక్రియలో ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఈ నెల 27 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. వలసల విషయంలో ట్రంప్ విధానాలకు తోడు ప్రతిపాదిత బిల్లు అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
